రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న సంస్థాగత పెట్టుబడులు

రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న సంస్థాగత పెట్టుబడులు

రియల్ ఎస్టేట్ సంస్థల్లో సంస్థాగత పెట్టుబడులు క్రమంగా పుంజు కుంటున్నాయి. 2023తో పోలిస్తే దేశీయ రియాల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 51 శాతం వృద్ధి చెందాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2023లో రియాల్టీ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్లు 5.878 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే, ఈ ఏడాది 8.878 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఇక విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా 63 శాతం పుంజుకున్నాయి. రెసిడెన్షియల్ సెగ్మెంట్‌లోకి 45 శాతం, ఆఫీసు భవనాల నిర్మాణంలో 28 శాతం, గోదాముల నిర్మాణంలోకి 23 శాతం పెట్టుబడులు వచ్చి చేరాయి. ‘రియాల్టీ రంగంలో 2024 ఒక మైలురాయిగా నిలువనున్నది. ఇన్వెస్టర్లకు రియాల్టీ సంస్థల మధ్య జరిగిన 78 ఒప్పందాల్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి 8.9 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చి చేరాయి. 

2007 తర్వాత రియాల్టీ రంగంలో రికార్డు స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. 2007లో రియాల్టీ రంగంలోకి 8.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. రియాల్టీ రంగ పెట్టుబడుల్లో ప్రధాన వాటా రెసిడెన్షియల్ సెగ్మెంట్‌దే.

2023తో పోలిస్తే ఆఫీసు భవనాల సెగ్మెంట్ పెట్టుబడులు మాత్రం 17 శాతం తగ్గుముఖం పట్టాయని జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. జేఎల్ఎల్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ లతా పిళ్లై మాట్లాడుతూ ‘సమర్థవంతమైన వృద్ధి, రాజకీయ సుస్థిరత వంటి కారణాలతో అంతర్జాతీయ ఆర్థిక రంగం నేపథ్యంలో భారత్‌లో వైవిధ్య భరితమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. 

2023 నుంచి దేశీయంగా రియాల్టీ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు 2024లోనూ కొనసాగాయని గుర్తు చేశారు. 2019-22 మధ్య సగటున రియాల్టీ రంగంలో 19 శాతం సంస్థాగత పెట్టుబడులు ఉంటే, ఈ ఏడాది అది 37 శాతానికి పెరిగిందన్నారు.