
ప్రతి ఏడాది మాదిరిగానే 2025లోనూ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగనున్నది. వచ్చే జనవరి 20 నుంచి ఐదు రోజులు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సీఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, కే రామ్మోహన్ నాయుడు, జయంత్ చౌదరి హాజరవుతారు.
వీరితోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్ (మహారాష్ట్ర), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), ఏ రేవంత్ రెడ్డి (తెలంగాణ)తో పాటు వందలాది మంది ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తన కొడుకు, మంత్రి నారా లోకేష్ తో కలిసి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరవుతారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్, తమిళనాడు మంత్రి టీఆర్‌బీ రాజా, ఉత్తరప్రదేశ్ మంత్రి సురేశ్ ఖన్నా పాల్గొంటారు. 2025 జనవరి 20 నుంచి ఐదు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు- తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతలు, అధికారులతోపాటు దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధిపతులు కూడా సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు.
రిలయన్స్, టాటా సన్స్, అదానీ గ్రూప్, బిర్లా, భారతీ, మహీంద్రా, గోద్రెజ్, జిందాల్, బజాజ్, వేదంతా గ్రూపు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీల భవిష్యత్ తరం ప్రతినిధులు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, విప్రో నుంచి రిషాద్ ప్రేమ్ జీ, రెన్యూ సుమంత్ సిన్హా, పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా తదితరులు పాల్గొంటారు.ఈ సదస్సులో నైతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం, భూతాపం వంటి ఉమ్మడి సవాళ్లు, అధిక రుణ భారం, తక్కువ వృద్ధి రేటు నుంచి బయట పడే మార్గాలపై డబ్ల్యూఈఎఫ్ సదస్సులో చర్చిస్తారు. ఏఐ, క్వాంటం టూ ఎనర్జీ టెక్, బయోటెక్, హెల్త్ టెక్ వంటి ఇంటర్ కనెక్టెడ్ టెక్నాలజీస్‌తో ఉత్పాదకత పెంపు, జీవన ప్రమాణాల పెంపుదల తదితర అంశాలపై చర్చిస్తారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
24 శాతం పెరిగిన ఎంపీల జీతాలు
ముగ్గురితో వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడుతున్నాం