
రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్నా, ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే, అలా వైద్య సాయాన్ని అడ్డుకోరని పేర్కొంది.
ఈ విషయాన్ని వారికి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్ – పంజాబ్ చీఫ్ సెక్రటరీకి సూచించారు. దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలుచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది.
ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిరవధిక దీక్షను కొనసాగిస్తున్న దల్లేవాల్‌కు వైద్యసహాయం అందేలా చూడాలని తాము పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని, అయితే వాటిని అమలుచేయడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలపై కోర్టు సంతృప్తి చెందలేదని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో రైతు నేత దలేవాల్‌ను వెంటనే ఆస్పత్రిలో చేరేందుకు ఒప్పించి, ఆస్పత్రికి తరలించాలని ఈ నెల 20న పంజాబ్ చీఫ్ సెక్రెటరీ, డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయడంలో వారు విఫలం కావడంతో వారికి వ్యతిరేకంగా కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.
దలేవాల్‌ను ఆస్పత్రికి తరలించకుండా ఇతర రైతు నేతలు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు ఆ రైతు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దలేవాల్ క్షేమం కోరేవారు ఆవిధంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించింది. రైతు నేతలతో మాట్లాడి దలేవాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!