ఇక ఏటీఎంల నుంచి నేరుగా పిఎఫ్ డబ్బు

ఇక ఏటీఎంల నుంచి నేరుగా పిఎఫ్ డబ్బు
ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులు త్వరలో తమ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) డబ్బును సెటిల్‌మెంట్‌ తర్వాత ఏటీఎంల నుంచి నేరుగా తీసుకోవచ్చు. ప్రస్తుతం (ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారులు ఆన్‌లైన్‌లో తమ క్లెయిముల పరిష్కారానికి 7 నుంచి 10 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. సెటిల్‌మెంట్‌ తర్వాత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ అవుతోంది.

కొత్తగా అమలు చేయనున్న విధానం ప్రకారం ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు తమ పొదుపు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంలలో ఉపయోగించుకునే విధంగా ఉండే ప్రత్యేక కార్డులు అందజేస్తామని కార్మిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ 7 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు బ్యాంకింగ్‌ వ్యవస్థకు దీటుగా సేవలను కల్పించాలని ఈపీఎఫ్‌ఓ యోచిస్తున్నట్లు చెప్పారు.

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు త్వరలోనే బ్యాంకింగ్ సిస్టమ్‌తో సమానంగా సేవలు పొందనున్నారని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడించారు. ఖాతాదారులు ఇకపై తమ పీఎఫ్‌ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఇందుకోసం ఈపీఎఫ్‌ఓ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.

ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి పైనే ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. ఈపీఎఫ్‌ఓ వ్యవస్థను బ్యాంకింగ్‌ వ్యవస్థతో సమానంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. కొత్త విధానం కింద క్లెయిమ్‌దారులు, లబ్ధిదారులు లేదా బీమా పొందిన వ్యక్తులు ఏటీఎంల ద్వారా తమ డబ్బును తీసుకోవచ్చని ఆమె చెప్పారు. 

మరణించిన ఖాతాదారుల వారసులకు ఈడీఎల్‌ఐ పథకం కింద గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు సమకూరుస్తామని ఆమె వివరించారు. కొత్త విధానంలో మరణించిన ఈపీఎఫ్‌ఓ ఖాతాదారుని వారసులు కూడా సెటిల్‌మెంట్‌ డబ్బును ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చని చెప్పారు. 2025 జనవరిలోపు హార్డ్‌వేర్ అప్‌గ్రేడేషన్ జరిగే అవకాశం ఉంది. దీని వల్ల ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు పొందడానికి వీలవుతుంది.