పౌర‌స‌త్వ జ‌న్మ‌హ‌క్కును తొలిగించే ఆలోచ‌న‌లో ట్రంప్

పౌర‌స‌త్వ జ‌న్మ‌హ‌క్కును తొలిగించే ఆలోచ‌న‌లో ట్రంప్
 
* కాబోయే కోడలికి గీక్ రాయబారి పదవి
 
అమెరికాలో జ‌న్మించిన వారికి పౌరసత్వం లభిస్తుంది. తల్లితండ్రులకు పౌర‌స‌త్వం లేకున్నా అమెరికాలో పుట్టే పిల్ల‌ల‌కు పౌర‌స‌త్వం ఇస్తున్నారు. 150 ఏళ్ల నుంచి అమ‌లులో ఉన్న ఆ రాజ్యాంగ హ‌క్కును ఇప్పుడు కాబోయే అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తొల‌గించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. పౌర‌సత్వ జ‌న్మ‌హ‌క్కు హాస్యాస్ప‌ద‌మైంద‌ని, జ‌న‌వ‌రి 20వ తేదీన బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఆ హ‌క్కును ట్రంప్ కాల‌రాస్తార‌ని భావిస్తున్నారు. బ‌ర్త్‌రైట్ సిటిజ‌న్‌షిప్‌ను మార్చేస్తామ‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ట్రంప్ తెలిపారు. దీనిపై తుది నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల్సి ఉంటుంద‌ని, కానీ ఏదో ఓ సంద‌ర్భంలో అంతం కావాల‌ని స్పష్టం చేశారు. తొలి ద‌శ అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ పౌర‌స‌త్వ అంశాన్ని ప్ర‌స్తావించారు. 14వ స‌వ‌ర‌ణ ద్వారా పౌర‌స‌త్వ జ‌న్మ‌హ‌క్కును రాజ్యాంగంలో పొందుప‌రిచారు. అమెరికా చ‌ట్టాల కింద ఆ హ‌క్కును ప‌టిష్టంగా అమ‌లు చేస్తున్నారు.

ఇప్పుడు ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయ‌డం అంటే, చాలా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పౌర‌స‌త్వ జ‌న్మ‌హ‌క్కు వ‌ల్ల‌ గ‌ర్భంతో ఉన్న విదేశీ మ‌హిళ‌లు అమెరికాలోకి ప్రవేశించి, ఇక్క‌డ పిల్ల‌ల‌ను ప్ర‌సవించిన త‌ర్వాత‌ మ‌ళ్లీ వెళ్లిపోతున్నార‌ని, అందుకే ఆ విధానాన్ని మార్చాల‌ని ట్రంప్‌తో పాటు ఇత‌ర పార్టీలు ఆలోచిస్తున్నాయి.

మరోవంక, డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుటుంబ సభ్యులకు కీలక పదవులను కట్టబెడుతున్నారు.  తాజాగా తన కుమారుడు డొనాల్డ్‌ జూనియర్‌కు కాబోయే భార్య కింబర్లీ గిల్‌ఫోయిల్‌ ను గ్రీక్‌ రాయబారిగా నియమించారు. గ్రీక్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు, రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు తదితర విషయాల్లో కింబర్లీ బలమైన దౌత్య సంబంధాలు నెలకొల్పగలదని ఈ సందర్భంగా ట్రంప్‌ ఆకాంక్షించారు.

కింబర్లీ గతంలో ఫాక్స్‌న్యూస్‌ హోస్ట్‌గా పనిచేశారు. అనంతరం పొలిటికల్‌ ఫండ్‌ రైజర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. మీడియా, రాజకీయాలతో ఆమెకు ఉన్న విస్తృత అనుభవం, నాయకత్వంతోపాటు తెలివితేటలు ఆమెకు ఈ పదవి కట్టబెట్టడానికి కారణమని ట్రంప్‌ పేర్కొన్నారు. డిసెంబర్ 31, 2020లో ట్రంప్‌ కుమారుడు జూనియర్‌ ట్రంప్‌తో కింబర్లీ నిశ్చితార్థం జరిగింది.

ఇక ఇటీవలే ట్రంప్‌ తన వియ్యంకులకు కీలక పదవులు అప్పగించారు.  పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా మస్సద్‌ బౌలోస్‌ను ఎంపిక చేసుకున్నారు. బౌలోస్‌ లెబనీస్‌-అమెరికన్‌ వ్యాపారవేత్త. ఆయన కుటుంబ సభ్యులకు నైజీరియా, లెబనాన్‌లలో వ్యాపారాలు ఉన్నాయి. ట్రంప్‌ చిన్న కుమార్తె టిఫ్ఫనీని బౌలోస్‌ కుమారుడు మైఖేల్‌ వివాహం చేసుకున్నారు. ఇక మరో వియ్యంకుడు చార్లెస్‌ కుష్నర్‌ను ఫ్రాన్స్‌ రాయబారిగా ఎంపిక చేసుకున్నారు. ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌కు తండ్రి చార్లెస్‌ కుష్నర్‌.