* నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి … ఆర్ఎస్ఎస్
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను కేవలం చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కారం కాకపోవచ్చని, మరిన్ని నిర్దిష్టమైన చర్యలు అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హితవు చెప్పారు.
బాంగ్లాదేశ్ లో మైనారిటీలపై జారుతున్న దాడుల పట్ల నిరసనగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన సకల హిందూ సమాజ్ సభలో పాల్గొంటూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే చర్చలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని తాను ఆశిస్తున్నానని, ఒకవేళ అలా జరగకపోతే మరో పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మహ్మద్ యూనస్ నడుపుతున్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం శాంతి లేదని సునీల్ అంబేకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట వినకపోతే మరో మార్గాన్ని వెతకాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు ఆయన కీలక సూచనలు చేశారు.బంగ్లాదేశ్‌లో ఏమి జరుగుతుందో ప్రతి హిందువు ఆగ్రహంగా ఉన్నారని చెబుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై అఘాయిత్యాలు ఆగిపోయి దోషులను శిక్షించేలా చూడాలని అంబేకర్ కోరారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పొరుగు దేశంలో పర్యటించడం వల్ల కొంత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం “మరిన్ని గట్టి చర్యలు” తీసుకోవాలని, ఇందుకోసం ఇతర దేశాలతో కూడా మాట్లాడాలని ఆయన చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ఇబ్బందులను సృష్టించే వారి వెనుక కొన్ని ప్రపంచ శక్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. “మనం అలాంటి శక్తులను గుర్తించి వాటిని బహిర్గతం చేయాలి. మన దేశంలో, ఇతర దేశాలలో హిందువులకు సంబంధించి అలాంటి వాటిని ఆపమని వారికి చెప్పాలి” అని అంబేకర్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయన న్యాయవాదిపై దాడి దారుణాల పరిమితిని దాటిందని అంబేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు పారిపోవడం లేదని, ఐక్యంగా అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
మరోవంక, బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులపై దాడులు జరుగుతున్నట్లు ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది. వివిధ అంతర్జాతీయ నివేదికలు బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నట్లు వెల్లడిస్తున్నా, ఇన్నాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న బంగ్లా ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది.
షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు అంగీకరించింది. వీరిలో ముఖ్యంగా హిందువులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మతపరమైన హింసాత్మక ఘటనల కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ వెల్లడించారు.
ఇటీవలి కాలంలో మరిన్ని ఘటనలు, అరెస్టులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అక్టోబర్ 22 తర్వాత చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు