వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ, ఆ విషయం దాచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది.
ఆయనకు రూ.30 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బి విజయసేన రెడ్డి తీర్పు చెప్పారు. దీనిలో రూ.25లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు, రూ.5లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పైగా, కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పదిన్నర ఏళ్లపాటు హైకోర్టులో చెన్నమనేని రమేష్ కేసు సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సమయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు నకిలీ పత్రాలను సమర్పించారని కోర్టు మండిపడింది. జర్మన్ పౌరుడు కాదని ఆ దేశ రాయబార కార్యాలయం నుండి పత్రం సమర్పించడంలో విఫలం అయ్యాడని, ఎమ్యెల్యేగా ఉంటూనే తరచుగా జర్మనీ వెళ్లి వస్తూ ఉండేవాడని తెలిపింది. నెలరోజుల పాటు ఆర్డర్‌ను సస్పెన్షన్‌లో ఉంచాలని చెన్నమనేని రమేష్ న్యాయవాది కోరారు.
కాగా ఈరోజు తీర్పు నేపథ్యంలో మరికొన్ని అంశాలను న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ ఉందని కూడా తెలిపారు. అయితే, పాస్ పోర్ట్ ప్రామాణికం కాదని చెన్నమనేని తరపు న్యాయవాది తెలిపారు.
భారతీయ పాస్ పోర్ట్ ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించగ లేదని కోర్టుకు తెలిపారు. అన్ని వాదనలు పరిగణనలోకి తీసుకున్నామని హైకోర్టు తెలిపింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయాల్లో చెన్నమనేని కుటుంబాలు పలు దశాబ్దాలుగా ఆధిపత్యం వహిస్తున్నాయి. ఆయన తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు ప్రముఖ సిపిఐ నేతగా పేరొందారు. పలు దశాబ్దాలపాటు అక్కడి నుండి ఎమ్యెల్యేగా గెలువపండుతూ సిపిఐ శాసనసభా పార్టీ నేతగా ఉన్నారు.
అయితే, చివరిలో టిడిపిలో చేరి ఆ పార్టీ ఎమ్యెల్యేగా గెలుపొందారు. రామేశ్వరరావు సోదరుడు విద్యాసాగరరావు బిజెపి ఎమ్యెల్యేగా, ఎంపీగా గెలుపొందారు. మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. తండ్రివారసుడిగా 2009లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి రమేష్ గెలుపొందారు.
2009లో సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేయగా ప్రత్యర్థిగా అది శ్రీనివాస్ నిలిచారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన శ్రీనివాస్ రమేష్‌బాబు ఎన్నిక చెల్లదని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పౌరసత్వ వివాదంపై కేంద్ర హోమ్ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు.
2010 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేసిన సందర్భంలోనూ అది శ్రీనివాస్ ఎన్నికల కమిషన్‌ను అశ్రయించారు. అప్పుడు ఎన్నికల కమిషన్‌షెడ్యూల్‌ను నిలిపివేసింది. హైకోర్టును బీఆర్‌ఎస్ పార్టీ ఆశ్రయించగా అరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికలు జరపాలని చెప్పింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఉప ఎన్నికల్లో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి రమేష్‌బాబు పౌరసత్వంపై అది శ్రీనివాస్ పోరాటం చేస్తూనే వచ్చారు. 2013లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని, శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. రమేష్‌బాబు సుప్రీం కోర్టును అశ్రయించి స్టే పొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి రమేష్‌బాబు గెలుపొందారు. కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017లో రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. హోంశాఖ హైకోర్టును సంప్రదించవచ్చని పేర్కొనడంతో మళ్లీ హైకోర్టుకు చేరుకుంది.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు