మహా కుంభ మేళాకు వెళ్లే వారికి 13వేల రైళ్లు

మహా కుంభ మేళాకు వెళ్లే వారికి 13వేల రైళ్లు

మహా కుంభమేళా సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే వివిధ ప్రాంతాల నుంచి మహా కుంభమేళాకు దాదాపు 13,000 రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిల్లో 3,000 ప్రత్యేక రైళ్లు ఉంటాయని స్పష్టం చేశారు. మెగా ఈవెంట్ కోసం రైల్వే ఏర్పాట్లను సమీక్షించడానికి ప్రయాగ్ రాజ్​కు రైలులో ప్రయాణించిన వైష్ణవ్ మహాకుంభమేళా  సమయంలో సుమారు 1.5 నుంచి 2 కోట్ల మంది ప్రయాణికులు రైళ్ల​ ద్వారా నగరానికి చేరుకుంటారని అంచనా వేశారు.

పుష్య మాసంలోని పూర్ణిమ సందర్భంగా జనవరి 13న మొదలయ్యే ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగియనుంది. మరోవైపు, గంగానదిపై నిర్మించిన కొత్త వంతెనను కూడా తాను పరిశీలించానని, దీనిని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వైష్ణవ్​ తెలిపారు. “గంగా నదిపై వందేళ్ల తర్వాత కొత్త వంతెనను నిర్మించారు,” అని వైష్ణవ్ వెల్లడించారు.

రైళ్లు వచ్చే వరకు భక్తులు కూర్చునేందుకు వీలుగా ఆయా స్టేషన్ల హోల్డింగ్ ప్రాంతాలను కూడా మంత్రి పరిశీలించారు. భక్తులు సరైన వేదికకు చేరుకునేందుకు వీలుగా హోల్డింగ్ ఏరియాలు, టికెట్లలో కలర్ కోడింగ్​ను ఉపయోగించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మొబైల్ యూటీఎస్ అప్లికేషన్​ని మొదటిసారి ప్రయాగ్ రాజ్​లో ఉపయోగిస్తామని వైష్ణవ్ చెప్పారు. ఇంతకు ముందు రథయాత్ర సమయంలో దీనిని పూరీలో ఉపయోగించారు.

“మహా కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్- వారణాసి మార్గంలో రైల్వే ట్రాక్​ని రెట్టింపు చేశారు. ఫఫమౌ-జంఘై సెక్షన్​ని డబుల్​ చేశారు. ఝాన్సీ, ఫఫమౌ, ప్రయాగ్రాజ్, సుబేదార్​గంజ్, నైని, చియోకీ స్టేషన్లలో రెండో ప్రవేశ ద్వారం నిర్మించారు,” అని వైష్ణవ్ తెలిపారు. ప్రతి స్టేషన్​లో కంట్రోల్ రూమ్​ని ఏర్పాటు చేస్తామని, ఇది ప్రయాగ్ రాజ్ స్టేషన్​లోని మాస్టర్ కంట్రోల్ రూమ్​కు లైవ్ వీడియో ఫీడ్​ను అందిస్తుందని ఆయన చెప్పారు. 

మహా కుంభ్ నగర్​లోని సీసీటీవీ ఫీడ్ మాస్టర్ కంట్రోల్ రూమ్ నుంచి అందుబాటులో ఉంటుందని, ప్రయాగ్ రాజ్​లోని వివిధ స్టేషన్లలో 48 ప్లాట్​ఫామ్​లతో పాటు 23 హోల్డింగ్ ఏరియాలను నిర్మించామని కేంద్ర మంత్రి తెలిపారు. హోల్డింగ్ ప్రాంతాలతో పాటు 21 అడుగుల ఓవర్ బ్రిడ్జిలు, 554 కియోస్క్ టికెటింగ్ డెస్క్​లను సైతం ఏర్పాట్లు చేశారు. గత రెండేళ్లలో మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే రూ .5,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని వైష్ణవ్ తెలిపారు.