మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?

మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?
ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు, నటుడు మనోజ్‌ మధ్య ఆస్తుల విషయమై ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తున్నది. పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జల్‌పల్లి ఫాంహౌస్‌లో ఇరువురు గొడవపడ్డట్టు సమాచారం. ఆదివారం ఉదయం మోహన్‌బాబు, మనోజ్‌ ఇద్దరి నుంచి డయల్‌ 100కు కాల్‌ రావడంతో పహడీ షరీఫ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు మోహన్‌బాబు ఫాంహౌస్‌కు వెళ్లారు. 
 
ఇరువురిని విచారించిన తర్వాత ఘటనపై ఎస్‌ఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఫామ్‌హౌజ్‌కు వెళ్లి మోహన్‌బాబు, మనోజ్‌ను విచారించాం. స్వల్పంగా గొడవ పడ్డట్టు చెప్పారు. అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారని వివరించారు. అటు గొడవపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని డీఐ జితేందర్‌రెడ్డి తెలిపారు. అప్పటికే ఈ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది.
 
అదే సమయంలో ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని, అంతా మీడియా ప్రచారమే అంటూ మోహన్‌బాబు చెప్పినట్టుగా మరో వార్త వచ్చింది. అంతటితో వివాదం సద్దుమణిగిందని మీడియా వర్గాలు భావించాయి. కానీ ఈ నేపథ్యంలో మనోజ్‌ గాయాలతో బంజారాహిల్స్‌లోని ఓ దవాఖానలో చికిత్స కోసం చేరారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
మనోజ్‌ నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టు దృశ్యాల్లో కనిపిస్తున్నది. మనోజ్‌ వెంట ఆయన భార్య మౌనిక కూడా ఉన్నారు. తన తండ్రి మోహన్‌బాబు, అతడి అనుచరులు కలసి తనపై దాడి చేశారని మనోజ్‌ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.  కాలు, మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయం అయినట్లు వైద్యులు గుర్తించారు.
 
మనోజ్‌కు ఎంఎల్‌సీ (మెడికో లీగల్‌ కేసు) పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్థారించారని తెలిసింది.
 
మోహన్‌బాబు, మనోజ్‌ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా రోజంతా జరిగిన పరిణామాలు మంచు ఫ్యామిలీలో గొడవ జరిగినట్టు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరిగింది. గొడవ జరిగిన మాట వాస్తవమేనని పోలీసులు కూడా ధ్రువీకరించడంతో కారణాలపై పలు కోణాల్లో ప్రచారం నడుస్తున్నది. విద్యాసంస్థలు, ఆస్తుల పంపకం వ్యవహారంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్నదని, ఇదే ఘర్షణకు దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు.