ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
సోమవారం ఉదయం ఢిల్లీలోని 40కు పైగా పాఠశాలలకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా స్కూల్, మయూర్‌విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, బ్రిటిష్ స్కూల్, సాల్వాన్ స్కూల్, మోడరన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్, డిఎవి స్కూల్ ట్రీట్ ఇమెయిల్‌లు అందుకున్న పాఠశాలల్లో ఉన్నాయి.
 
 పాఠశాల నిర్వాహకులు పిల్లలను వారి ఇళ్లకు పంపించివేశారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం, ఈ ఉదయం 7 గంటలకు బెదిరింపు గురించి పోలీసులు,  అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. గత రాత్రి 11 గంటలకు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. పాఠశాల అధికారులు తమ పిల్లలను స్వస్థలాలకు తీసుకురావాలని తల్లిదండ్రులకు తెలియజేశారు.
బాంబులు చాలా చిన్నవని, ఎవరూ గుర్తించలేని ప్రదేశాల్లో అమర్చామని పేర్కొన్న ఆగంతకులు వాటిని నిర్వీర్యం చేయాలంటే 30 వేల డాలర్లు కావాలని డిమాండ్ చేశారు. ‘మేము పెట్టిన బాంబుల వల్ల భవనాలకు పెద్దగా నష్టం జరగదు.. కానీ, అవి పేలితే చాలా మందికి గాయాలవుతాయి. అవయవాలను కోల్పోకతప్పదు’ అని హెచ్చరించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను గుర్తించే పనిలో ఉన్నారు
 
పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పాఠశాలలను ప్రాంగణాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అభ్యంతరకరమైన వస్తువు కనిపించలేదు. “ప్రియమైన తల్లిదండ్రులారా, పాఠశాలలో బాంబు బెదిరింపు గురించి ఈ ఉదయం ఒక ఇమెయిల్ వచ్చింది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే చెదరగొట్టారు. దయచేసి మీ సంబంధిత బస్ స్టాప్‌ల నుండి మీ పిల్లలను సేకరించవలసిందిగా కోరుతున్నాము” అంటూ సోషల్ మీడియా ద్వారా తల్లితండ్రులకు సందేశాలను పంపారు.

కాగా, రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న పలు సీఆర్‌పీఎఫ్‌ స్కూళ్లకు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 21న ఢిల్లీలోని రెండు, హైదరాబాద్‌, తమిళనాడులోని ఓ సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అక్టోంబర్‌ 20న సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌ ఆవరణలో భారీ పేలుడు కూడా సంభవించింది. దీంతో సమీపంలో ఉన్న పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఎక్స్ లో పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపులను ఉటంకిస్తూ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితి గురించి  ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఇలా రాసింది: “డిల్లీలో విమోచన క్రయధనం, హత్యలు, కాల్పులు వంటి రోజువారీ సంఘటనల తరువాత, ఇప్పుడు పాఠశాలలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఢిల్లీలో శాంతిభద్రతలు ఇంత దారుణంగా గతంలో ఎన్నడూ లేవు. ఢిల్లీ ప్రజలకు భద్రత కల్పించడంలో బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం విఫలమైంది” అంటూ విమర్శించారు.