ఏపీలో 3 వేల మంది చిన్నారులు మిస్సింగ్

ఏపీలో 3 వేల మంది చిన్నారులు మిస్సింగ్

ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల మిస్సింగ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. 3 వేల మంది బాలికలు తప్పిపోయిన అంశంకు సంబంధించి నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి (సీఎస్, డీజీపీ)కి ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అయినా అందుకు సంబంధించి నివేదికను ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసింది.

అందుకే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ సమన్లు జారీ చేసింది. జనవరి 20న కమిషన్ ముందు అవసరమైన సమాచారం, వివరాలతో వ్యక్తిగతంగా హాజరవ్వాలని స్పష్టం చేసింది. అయితే జనవరి 14లోపు సమగ్ర నివేదిక అందజేస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని  జాతీయ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది.

న్యాయవాది, సామాజిక కార్యకర్త ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఓ పత్రికలో ప్రచురించిన వివరాలను ఫిర్యాదుకు జత చేశారు. ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. ప్రతిరోజూ 8 మంది కంటే ఎక్కువ మంది బాలికలు తప్పిపోయారని వివరించారు. 2022లో డేటా ప్రకారం.. వారిలో చాలామంది ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు.

దాదాపు 371 మంది తప్పిపోయిన బాలికల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని ఫిర్యాదుదారు ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 3,592 మంది బాలికలు అదృశ్యమయ్యారు. వారిలో 3,221 మంది బాలికల ఆచూకీ లభించింది. ఈ ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అవసరమైన ప్రతిస్పందనను పన్నెండు వారాల్లోగా సమర్పించాలని సీఎస్,  డీజీపీని ఆదేశించింది.

2022, 2023, 2024 సంవత్సరాల్లో తప్పిపోయిన పిల్లల సమగ్ర స్థితి నివేదికను 18-06-2024 తేదీన ఆంధ్రప్రదేశ్ అదనపు డీజీపీ వీడియో లెటర్ ద్వారా సమర్పించారు. కానీ.. సీఎస్ నుంచి ఎలాంటి నివేదిక రాలేదు. దీంతో సీఎస్ వ్యక్తిగతంగా హాజరవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు జారీ చేసింది.