దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలే రాజధాని ప్రాంతంలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 500 మార్క్‌ను దాటింది. దీంతో కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 నిబంధనలు విధించారు. ఈ నిబంధనలు కాస్త సత్ఫలితాలనిచ్చాయి.
శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో గాలి నాణ్యత మోడరేట్ కేటగిరీలో నమోదైంది. ఏక్యూఐ లెవల్స్ 183గా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం చాందినీ చౌక్, ఐటీవో ప్రాంతాల్లో ఏక్యూఐ 183గా రికార్డైంది. ఓఖ్లా ఫేజ్-2లో 168, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంతంలో 159, పట్పర్గంజ్‌లో 195, ఆయా నగర్‌లో 115, లోధి రోడ్డులో 124, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ -3 వద్ద 137గా ఏక్యూఐ నమోదైంది. అదే సమయంలో కొన్ని ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత పూర్ కేటగిరీలో నమోదైంది.
ఆనంద్ విహార్‌లో 246, వాజీపూర్‌లో 208, ఆర్కేపురంలో 204, రోహిణిలో 217, పంజాబీ భాగ్‌లో 212, ముంద్కాలో 244తో పూర్ కేటగిరీలో ఏక్యూఐ నమోదైంది. గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.ప్రస్తుతం ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో వాయుకాలుష్యం మెరుగుపడటంతో ఆంక్షలు సడలించారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేటప్టింది. కాలుష్యం మెరుగుపడటంతో జీఆర్‌ఏపీ-4 ఆంక్షల సడలింపునకు అనుమతి ఇచ్చింది. సుప్రీం అనుమతితో రాజధానిలో శుక్రవారం నుంచి పాఠశాలలు తెరచుకున్నాయి.
పరిమితుల సడలింపు తర్వాత శుక్రవారం నుంచి ఢిల్లీ పాఠశాలల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభమవుతాయని విద్యా శాఖ డైరెక్టరేట్ తెలిపింది. 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లోని పిల్లలందరికీ ఆన్‌లైన్ తరగతులు ఇకపై నిర్వహించబడవని స్పష్టం చేశారు. గ్రూప్ 2 ఆంక్షల కింద ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం కొనసాగుతుంది. బొగ్గు, కలపను కాల్చడం వంటి ఆంక్షలు కూడా అలాగే ఉంటాయి.
ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని కూడా సూచించింది. అయితే చలి పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో ఏటా కాలుష్యం పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా అదే తీరు కనిపిస్తోంది. స్కైమేట్, ప్రైవేట్ వాతావరణ అంచనా ఏజెన్సీ ప్రకారం ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో గాలి వేగం పెరగడం వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్ లో కాలుష్య స్థాయిలు తగ్గాయి.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు