దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవంలో యువత భాగస్వామ్యం  

* భారత ప్రజాస్వామ్యానికి అమూల్యమైన వారసత్వం మన రాజ్యాంగం : ప్రధాని మోదీ

నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1949, నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం, దేశవ్యాప్తంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని లేదా సంవిధాన్ దివస్‌ను పాటిస్తున్నారు. రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి, దేశం తన ప్రజాస్వామ్య విలువలు, సూత్రాల పట్ల కట్టుబడి ఉందని పునరుద్ఘాటించడానికి 2015 నుండి ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నారు. 
 
ఈ సంవత్సరం వేడుకల్లో భాగంగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 22 షెడ్యూల్డ్ భాషలు, ఇంగ్లీషుతో సహా 23 భాషలలో మైగవ్ పోర్టల్ ద్వారా రాజ్యాంగ పీఠికను ఆన్‌లైన్‌లో చదివేందుకు వీలు కల్పిస్తోంది. పౌరులు పీఠికను చదవడం, భాగస్వామ్య ధృవపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం,  దానిని సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా పాల్గొనవచ్చు. ఈ వేడుకలలో భాగంగా, నవంబర్ 18 నుండి 26 వరకు మైగవ్, మైభారత్ పోర్టల్స్ ద్వారా రాజ్యాంగ క్విజ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. 
 
దీనికి అదనంగా, యువత భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు, నవంబర్ 24 నుండి 26 వరకు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 786 జిల్లాలలో ‘విక్సిత్ భారత్ యువ సంవాద్’ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
 
వీటిలో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం, సెమినార్లు, వెబినార్లు, క్విజ్‌లు, వ్యాస, చర్చా పోటీలు, పోస్టర్ల తయారీ, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నడకలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాణం, దాని ముఖ్య లక్షణాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఉదయకాల సమావేశాలు, చర్చలు మరియు పోటీలను నిర్వహించాలని కూడా ప్రోత్సహించారు. 
 
క్షేత్రస్థాయి భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టితో, ఈ వేడుకలు డిజిటల్ వేదికలు, సమాజ ఆధారిత ప్రచార కార్యక్రమాల ద్వారా పౌరులలో, ముఖ్యంగా యువత, విద్యార్థులలో రాజ్యాంగ అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను స్మరించుకోవడానికి, అలాగే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు సామూహిక నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి రాజ్యాంగ దినోత్సవం ఒక సందర్భంగా ఉపయోగపడుతుంది. 

కాగా, భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక అమ్యూలమైన వారసత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నివాళులర్పించారు. అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్య సాధనలో రాజ్యాంగం నిరంతరం మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొంటూ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

 

About The Author