సంతోష్ దవాఖర్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోంధళ్’ మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. రాత్రి వేళ సంప్రదాయబద్ధంగా నిర్వహించే ‘గోంధళ్’ అనే జానపద ఆచార క్రతువు నేపథ్యంలో, కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథగా దీనిని ఆవిష్కరించారు. ఇష్టం లేని వైవాహిక బంధంలో నలిగిపోతున్న సుమన్ అనే మహిళ, భర్తను ఏమార్చి ప్రియుడితో కలిసి పారిపోయేందుకు వేసే ఎత్తుగడలు, భక్తి, మోసం, విధి కలగలిసిన భావోద్వేగాల సమాహారంగా ఈ సినిమా రూపొందింది.
సుమన్ పాత్రలో ఇషితా దేశ్‌ముఖ్ నటించగా, కిశోర్ కదమ్, యోగేష్ సోహోనీ, నిషాద్ భోయిర్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ 2025)లో ఈ చిత్రం ప్రదర్శితమై, సంతోష్ దవాఖర్కు ఉత్తమ దర్శకుడిగా ‘సిల్వర్ పీకాక్’ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అనంతరం 2026 సెప్టెంబర్‌లో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 33 చిత్రాల నుంచి దీనిని భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది. శ్వాస్ (2005), హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ (2009), కోర్ట్ (2015) తర్వాత ఆస్కార్ బరిలో నిలిచిన నాల్గవ మరాఠీ చిత్రమిది.
పోటీలో నిలిచిన మరో భారతీయ చిత్రం ‘అంగ్’
భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన ‘గోంధళ్’తో పాటు తేజా రియో దర్శకత్వం వహించిన ‘అంగ్’ అనే మరో భారతీయ చిత్రం కూడా ఇదే విభాగంలో అర్హత సాధించడం విశేషం. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మక ప్లాట్‌ఫామ్ అవార్డు గెలుచుకున్న నేపథ్యంతో, ప్రత్యేక ఫెస్టివల్ నిబంధనల మార్గంలో ‘అంగ్’ ఈ పోటీకి నేరుగా అర్హత సాధించింది. దీంతో ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్‌కు చెందిన రెండు చిత్రాలు బరిలో నిలిచినట్లయింది.

More Stories
రక్షణ శాఖ వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడ్డ పాక్ ఆపరేటివ్‌లు
అయోధ్య నుంచి నేపాల్‌కు నేరుగా రైలు నేడే ప్రారంభం
అగ్నివీరులకు వివాహం చేసుకోవటానికి అనుమతి