ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై స్పష్టంగా పోషకాహార వివరాలు

మనం ప్రతిరోజూ కొనుగోలు చేసే ఆహార పదార్థాల్లో ఏమేం పోషకాలు దాగి ఉన్నాయో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా చక్కెర, ఉప్పు, కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను సామాన్య వినియోగదారులు సైతం ఇట్టే గుర్తించేలా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై పోషకాహార వివరాలను మరింత స్పష్టంగా, పారదర్శకంగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ దిశగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తన పోషకాహార లేబులింగ్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సాధారణంగా ఆహార పదార్థాల ప్యాకెట్ల వెనుక భాగంలో చిన్న అక్షరాలతో పోషకాహార వివరాలు ముద్రిస్తుంటారు. అయితే షాపింగ్ సమయంలో వాటిని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదవడం లేదు. అందుకే ప్యాకెట్ ముందు భాగంలోనే చక్కెర, ఉప్పు, కొవ్వు వివరాలు స్పష్టంగా కనిపించేలా లేబులింగ్ ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 
 
దీనివల్ల వినియోగదారులు ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందే వాటిలోని పోషకాల గురించి పూర్తి అవగాహన పొందగలుగుతారు. ఆహార పదార్థాల్లో అధిక మోతాదులో ఉంటే ఆరోగ్యానికి ముప్పు కలిగించే మూడు ప్రధాన అంశాలైన ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వు వివరాలను ప్రత్యేకంగా హైలైట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మూడింటికీ ఒకే తరహా గుర్తు కాకుండా, ఒక్కోదానికి వేర్వేరుగా ఆరు వైపుల ఆకారంలో ఉండే ప్రత్యేక గుర్తులను ఉపయోగించాలని సూచించింది. 
 
అంతేకాదు, ప్రతి గుర్తుపై సంబంధిత హెచ్చరిక స్పష్టంగా ఉండేలా ‘అధిక చక్కెర’, ‘అధిక ఉప్పు’, ‘అధిక కొవ్వు’ అని కచ్చితంగా పేర్కొనాలి. ముఖ్యంగా కేవలం అదనంగా కలిపిన చక్కెర వివరాలకే పరిమితం కాకుండా మొత్తం చక్కెర పరిమాణాన్ని, అలాగే అదనపు కొవ్వుకు బదులుగా సంతృప్త కొవ్వు వివరాలను విధిగా చూపించాలని కోర్టు స్పష్టం చేసింది.

కొత్త లేబులింగ్ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ఆహార ప్యాకెట్లను చూడగానే వాటిలో చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది సులభంగా గుర్తించవచ్చు. ముఖ్యంగా ఏ ఆహార పదార్థాన్ని కొనుగోలు చేయాలనే విషయంలో వినియోగదారులు మరింత అవగాహనతో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

భారతీయుల కోసం 2024లో రూపొందించిన ఆహార మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ లేబులింగ్ విధానం ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆహార పదార్థాలపై పోషకాహార వివరాలను స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా అందించడం ద్వారా ప్రజలకు సరైన సమాచారం చేరుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. 

About The Author