
దేశంలో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు పౌరుల హక్కుల రక్షకులుగా మారాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఐపీసీ సహా పాత చట్టాలను బ్రిటిషర్లు, భారత్‌లో వారి దౌర్జన్యాలు, దోపిడీలకు అనుకూలంగా రూపొందించుకున్నారని తెలిపారు.
బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియమ్ అనే చట్టాలను కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూడు కొత్త చట్టాలను దేశంలో వంద శాతం అమలు చేసి మొదటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌గా నిలిచిన చండీగఢ్‌లో పర్యటించిన మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆ 3 కొత్త క్రిమినల్ చట్టాలను జాతికి అంకితం చేశారు.
రాజ్యాంగ విలువలు, వాటి ప్రాముఖ్యతకు లోటు రాకుండా భారతీయ న్యాయ సంహిత చట్టాలను రూపొందించామని ప్రధాని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆశయాల దిశగా అడుగులు వేసేందుకు కొత్త క్రిమినల్ చట్టాలు ఉపయోగపడనున్నాయని చెప్పారు. కొత్త చట్టాలతో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని మోదీ భరోసా ఇచ్చారు. ఉగ్ర సంస్థలు తప్పించుకోలేని రీతిలో కొత్త చట్టాలు పకడ్బందీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
‘పాత వ్యవస్థలో న్యాయప్రక్రియ కూడా ఒక శిక్షగానే ఉండేది. ఆరోగ్యకరమైన సమాజంలో చట్టం అనేది మనకు బలాన్ని ఇవ్వాలి. కానీ ఐపీసీలో చట్టం పట్ల భయం మాత్రమే ఉండేది. ఆ భయం బాధితుల్లోనే ఉండేది. నేరస్థుల కన్నా బాధితులలోనే చట్టాలు భయాన్ని పెంచేవి. రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే సహాయం చేసేందుకు ప్రజలు భయపడేవారు’ అని ప్రధాని గుర్తు చేశారు.
“డిజిటల్ సాక్ష్యాలు-సాంకేతికత ఏకీకరణతో ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు బలం చేకూరుతుంది. కొత్త వాటి వల్ల చట్టాల్లో ఉండే లొసుగుల ద్వారా ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలు ప్రయోజనాన్ని పొందలేవు. అంతేకాకుండా పౌరులందరి ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలను సాకారం చేసే దిశగా కొత్త చట్టాలు ముందడుగు వేస్తున్నాయి” అని ప్రధాని మోదీ వివరించారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం