ఒక్కలిగ పీఠాధిపతిపై కేసు మండిపడ్డ విపక్షాలు

ఒక్కలిగ పీఠాధిపతిపై కేసు మండిపడ్డ విపక్షాలు

ముస్లింలకు ఓటు హక్కును నిరాకరించాలంటూ ప్రకటన చేసిన ఒక్కలిగ పీఠాధిపతిపై కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అరాచకం ఏర్పడుతుందని హెచ్చరించారు. 

తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం ఇప్పుడు ఒక్కలిగ మహా సంస్థాన మఠం పీఠాధిపతి కుమార చంద్రశేఖరకాంత విషయంలో శీఘ్రంగా ఎందుకు స్పందించిందని  ఆయన ప్రశ్నించారు. ఆయనను వేధించి, ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశంతోనే సిద్ధూ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ నమోదు చేసిందని బీజేపీ ఆరోపించింది.

ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేయాలని వ్యాఖ్యానించిన విశ్వ వక్కలిగ మహా సంస్థానం మఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామిజీకి ఉప్పారపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 2వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించారు. దీంతో స్వామిజీ ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే ఆయన ముస్లింలకు క్షమాపణలు తెలిపారు. తాజాగా శనివారం ఆయన స్పందిస్తూ, తమ మఠానికి ముస్లింలు కూడా భక్తులుగా వస్తారని చెప్పారు. నోటీసు విషయం తెలియదని, తనకు ఆరోగ్యం బాగా లేదని, కేన్సర్‌తో విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు.