బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలను తక్షణమే ఆపాలి

బంగ్లాదేశ్‌లో హిందువులపై అకృత్యాలను తక్షణమే ఆపాలి
 
* ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పిలుపు
 
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మతపరమైన మైనారిటీలపై ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్న అకృత్యాలు, దాడులు, హత్యలు, దోపిడీలు, అగ్నిప్రమాదాలు, మహిళలపై అమానవీయ హింసలు వంటి వాటిపట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు.
 
ఈ సంఘటనలను ఆపడానికి తగిన చర్యలు తీసుకునే బదులు, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఇతర సంబంధిత ఏజెన్సీలు మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సహాయత పరిస్థితులలో బంగ్లాదేశ్ హిందువులు ఆత్మరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా తమ స్వరాన్ని పెంచడానికి ప్రయత్నించినప్పుడు, అన్యాయం, అణచివేతల కొత్త దశ స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు.
 
 హిందువుల శాంతియుత నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఇస్కాన్ సన్యాసి పూజ్య శ్రీ చిన్మోయ్ కృష్ణ దాస్ జీని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం అన్యాయం అని దత్తాత్రేయ హోసబలే విమర్శించారు. హిందువులపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే ఆపాలని, పూజ్య శ్రీ చినమయ్ కృష్ణ దాస్ జీని జైలు నుండి విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్  పిలుపునిచ్చింది.
 
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మతపరమైన మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించడానికి, ఈ విషయంలో అంతర్జాతీయ మద్దతును పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్  కోరింది. ఈ క్లిష్ట సమయంలో, భారత్, ప్రపంచ సమాజం, అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ బాధితులకు అండగా నిలిచి తమ సంఘీభావాన్ని తెలియజేయాలని హోసబలే పిలుపిచ్చారు.
 
ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వానికి అవసరమైన ఈ విషయంలో సాధ్యమయ్యే ప్రయత్నాలు చేయాలని సంబంధిత ప్రభుత్వాలను డిమాండ్ చేయడం అవసరం అని ఆయన స్పష్టం చేశారు.