మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ రాసిన లేఖకు ఎన్నికల సంఘం స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న రావాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆహ్వానించింది. ఎన్నికలు ప్రతిదశలోనూ పారదర్శకంగా జరిగాయని తెలిపింది.
చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇవ్వనున్నట్లు ఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిన్న లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ, ఆధారాలు చూపేందుకు అపాయింట్‌మెంటు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఈసీ సానుకూలంగా స్పందించింది.
“మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయి. కానీ దీనిపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. వారి చట్టపరమైన ఆందోళనలను మేం పరిశీలిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తాం” అంటూ కాంగ్రెస్ పార్టీ బృందాన్ని ఈసీ ఆహ్వానించింది.
ఓటరు ఓటింగ్ డేటాకు సంబంధించి కాంగ్రెస్ లేవనెత్తిన సమస్యపై స్పందిస్తూ, పోలింగ్ స్టేషన్ల వారీగా అభ్యర్థులందరికీ అందుబాటులో ఉన్న ఓటర్ టర్న్ అవుట్ డేటాలో ఎలాంటి వ్యత్యాసం లేదని ఈసీ పేర్కొంది. “సాయంత్రం 5 గంటలకు పోలింగ్ డేటా, తుది ఓటింగ్ శాతంలో అంతరం విధానపరమైన ప్రాధాన్యతల కారణంగా ఉంది. ఎందుకంటే ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ ముగిసే సమయానికి ఓటరు ఓటర్ల డేటాను నవీకరించడానికి ముందు అనేక చట్టబద్ధమైన విధులను నిర్వహిస్తారు” అని తెలిపింది.
అదనపు బహిర్గతం చర్యగా, ఎన్నికల కమిషన్ సుమారు రాత్రి 11.45 గంటలకు పత్రికా ప్రకటనను విడుదల చేయడం 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రవేశ పెట్టమని, ఆ తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరిస్తున్నామని వివరించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్ర నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ పోలింగ్ డేటాలోనూ తేడాలున్నాయని లేఖలో ప్రస్తావించారు. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. కూటమిలోని బీజేపీకి 132, షిండే సేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. విపక్ష కూటమిలోని కాంగ్రెస్‌కు 16, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి