దివ్యాంగులకూ 80 శాతం నిధులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం

దివ్యాంగులకూ 80 శాతం నిధులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం
 
గ్యారెంటీల పేరుతో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు పాత పథకాలకు కోత పెడుతున్నది. గ్యారెంటీలకు నిధుల సమీకరణ కోసం ఇప్పటికే వివిధ రకాల చార్జీలు పెంచుతూ వస్తున్న సిద్ధరామయ్య సర్కారు ఇతర పథకాల నిధులను భారీగా తగ్గిస్తున్నది. 
 
ఆఖరికి దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించే నిధులను కూడా భారీగా తగ్గించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే దివ్యాంగుల కోసం కేటాయించాల్సిన నిధులను 80 శాతం మేరకు ప్రభుత్వం తగ్గించింది. వివిధ పథకాల ద్వారా దివ్యాంగులకు అవసరమైన వినికిడి పరికరాలు, బ్రెయిలీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీలు, విద్యార్థులకు టాకింగ్‌ ల్యాప్‌లాప్‌లు వంటివి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.

గత ఏడాది వీటి కోసం ప్రభుత్వం రూ.53 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మాత్రం ఈ పథకాలకు కేవలం రూ.10 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటకలో 13.24 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. దీంతో ప్రభుత్వం అందించే పరికరాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. కేవలం వినికిడి పరికరాల కోసం 5,173 మంది దరఖాస్తు చేస్తుకున్నారు. 

అయితే కేటాయించిన నిధులతో వీరిలో పదో వంతు మందికి కూడా పరికరాలు లభించవని దివ్యాంగుల సంఘాలు వాపోతున్నాయి. 553 మంది దివ్యాంగ విద్యార్థులు టాకింగ్‌ ల్యాప్‌టాప్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం 35 మందికి మించి ఇవ్వలేదని చెప్తున్నారు. దివ్యాంగుల నిధులకు కోత పెట్టడం అన్యాయమని, అసాధారణమని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ది బ్లైండ్‌ సంస్థ ఆరోపించింది.

కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలు రాష్ట్ర ఖాజానాను ఖాళీ చేస్తున్నాయి. వీటికి నిధులు సరిపోక పెట్రోల్‌, పాలు, మద్యం, ఇలా అన్నింటి ధరలను ప్రభుత్వం పెంచుతున్నది. దీనికి తోడు గ్యారెంటీలకు నిధులు సమీకరించేందుకు వివిధ వర్గాల సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఆయా కార్పొరేషన్ల నిధులను కూడా మళ్లిస్తున్నది. దివ్యాంగుల సంక్షేమానికి సైతం నిధులు తగ్గించడానికి కారణమిదేననే విమర్శలు వస్తున్నాయి. 

కాగా, రూ.14,730.53 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను గ్యారెంటీలకు మళ్లించడంపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సైతం ప్రభుత్వానికి ఇటీవల నోటీసులు జారీ చేసింది. మరోవైపు, గ్యారెంటీల వల్ల అభివృద్ధి పనులకు నిధులు ఉండటం లేదని, వాటిని ఆపేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే డిమాండ్‌ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది.