అసత్య ప్రచారం పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా

అసత్య ప్రచారం పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని మండిపడ్డారు.
 
ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం అని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు వాస్తవాల్ని వక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆ కేసులో తన పేరు ఎక్కడా లేదని, కానీ ఆ రెండు మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయని, వాటికి లీగల్ నోటీసులు పంపిస్తానని వెల్లడించారు.
 
అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న రెండు పత్రికలకు డెడ్‌లైన్ విధించారు. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం పట్ల జగన్ మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. 

ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా అవుతుందని, పాతికేళ్లలో లక్ష కోట్ల వరకూ ఆదా అయ్యేవని చెప్పారు.  ఇందులో అవినీతికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. పైగా, రూ.2.49కి అందుబాటులోకి ఇస్తాం అంటూ కేంద్రం పేర్కొందని, ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం అని స్పష్టం చేశారు.

చంద్రబాబు చేసుకున్న పీపీఏల వలన 2 వేలకోట్లు అదనపు భారం పడితే.. తమ ప్రభుత్వ నిర్ణయం వలన ఆదా అయ్యిందని చెప్పారు. యూనిట్ విద్యుత్‌కు రూ.5.90 పైసలకు ఒప్పందం చేసుకున్న చంద్రబాబు మంచోడా? యూనిట్ రూ.2.49 చొప్పున ఒప్పందం చేసుకున్న నేను మంచివాడినా? అని ప్రశ్నించారు. ఈ ఒప్పందం గురించి కూడా మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

రైతులకు ఉచిత కరెంట్ అందించడమేది ఒక కల అని చెప్పిన వైఎస్ జగన్ చంద్రబాబు పాలనలో డిస్కం‌లు దెబ్బతిన్నాయని చెప్పారు. చంద్రబాబు రాకముందు డిస్కంలకు రూ.29 వేలకోట్లు బకాయిలు ఉంటే, చంద్రబాబు దిగిపోయేనాటికి ఈ బకాయిలు, అప్పులు రూ.86 వేలకోట్లకు చేరినట్లు ఆరోపించారు. 

డిస్కంల మీద, ప్రభుత్వం మీద భారం పడకుండా, రైతులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సోలార్ పార్కుల ఏర్పాటు కోసం టెండర్లు పిలిచిందని వైఎస్ జగన్ చెప్పారు. 2020 నవంబర్‌లో ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచామని, ఆ టెండర్లలో రూ. 2.49 పైసలు నుంచి రూ.2.58 పైసలకు చొప్పున సరఫరా చేసేందుకు సుమారు 24 బిడ్ల వరకూ దాఖలయ్యాయని వివరించారు. 

అయితే చంద్రబాబు దానికి అడ్డుపడ్డారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న విండ్‌, సోలార్‌ పవర్‌ ఒప్పందాలతో ఏపీకి అదనపు భారం పడింది. చంద్రబాబు పీపీఏల వల్ల రూ.2 వేల కోట్ల భారం పడింది. అదనంగా రూ.3.41రూ. కట్టాల్సి వచ్చిందని వివరించారు.