జర్నలిస్ట్ విజయబాబుకు హైకోర్టు రూ 50,000 జరిమానా

జర్నలిస్ట్ విజయబాబుకు హైకోర్టు రూ 50,000 జరిమానా

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ పిఐఎల్ దాఖలు చేసిన పాత్రికేయుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు  పోలా విజయబాబు పట్ల ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  రాజకీయ ఉద్దేశంతోనే పిటిషనర్ పిటిషన్ వేశారని అభిప్రాయం వ్యక్తం చేసింది. విజయబాబుకు రూ.50 వేలు జరిమానా విధించింది.

విజయబాబు నెల రోజుల్లో ఈ రూ. 50 వేల జరిమానాను లీగల్ సర్వీస్ అథారిటీలో చెల్లించాలని ఆదేశించింది. అంధులు, బధిరుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. అలాగే సోషల్ మీడియాలో పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారికి మద్దతుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేయడంపై హైకోర్టు విజయ్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిందది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు తమ హక్కులు తెలుసుకోకుండానే పోస్టులు పెడుతున్నారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని, వారి తరపున పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. 

సమాజంలో తమ బాధను చెప్పుకోలేనివారి కోసం వేయాల్సిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారని కోర్టు అభిప్రాయపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిని చట్టం ముందు నిలబడితే తప్పెలా అవుతుందంటూ ఏపీ హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. 

పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తప్పెలా అవుతుందని నిలదీసింది. ఒకే ఉద్దేశంతో వందల మంది అసభ్యకరమైన పోస్టులు పెడితే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించింది. దురుద్దేశంతో ఒకే విధానంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారే కానీ  పోలీసులు ఒకే పద్ధతిలో కేసులు పెట్టడం లేదంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది.

ప్రణాళిక బద్దంగా ఇటువంటి కామెంట్లు పెట్టడం పట్ల కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికలను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటామంటే చట్టం ఒప్పుకోదని, న్యాయ పరంగా ఇది నేరం అవుతుందని హైకోర్టు హెచ్చరించింది.