అమరావతికి రూ. 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం

అమరావతికి రూ. 15,000 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం ఆమోదం
అమరావతి రాజధాని మొదటి దశ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ ప్రాజెక్టును ఆమోదించాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ప్రపంచ బ్యాంకు, ఎడిబి లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు రుణంలో ప్రపంచ బ్యాంకు, ఎడిబి లు రెండూ రూ.6800 కోట్ల చొప్పున మొత్తం రూ.13,600 కోట్లు ఇవ్వనున్నాయి. 
 
మిగిలిన రూ.1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, ఈ అప్పుపై కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ రుణాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ రుణంతో పాటు గృహ, పట్టణాభివృద్ధి కార్పొరేషన్‌ (హడ్కో), జర్మనీకి చెందిన కె.ఎఫ్‌.డబ్ల్యు డెవలప్‌మెంట్‌ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రూ.15 వేల కోట్లు (11 వేల కోట్లు+4 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
 
ప్రపంచ బ్యాంక్‌ రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లో ప్రయత్నం చేసినది కాదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ బ్యాంకు నుండి రుణం సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల దగ్గరకొచ్చేసరికి టిడిపి, బిజెపిల మధ్య రాజకీయ మిత్రత్వం తెగిపోవడంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ప్రపంచ బ్యాంకుకు చేసిన రుణ విజ్ఞప్తిని జులై 2019లో ఉపసంహరించుకుంది. 
 
ఆ తరువాత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల సమస్యను ముందుకు తీసుకురావడంతో గత ఐదేళ్లులో ప్రపంచ బ్యాంకు ముందడుగు వేయలేదు. ఇప్పుడు టిడిపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద మరల ప్రపంచ బ్యాంకు రుణం కోసం పావులు కదపటం, ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి రాజధాని ప్రాంతం పర్యటన చేయటం, ఎడిబి తో కలిసి రుణం ఆమోదం తెలపటం అన్నీ చక చకా జరిగిపోయాయి.

రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఎపి సిఆర్‌డిఏ), అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌ సంస్థ (ఎడిసి)లు స్టేక్‌ హోల్డర్లుగా కీలక పాత్ర పోషించనున్నాయి. అమరావతి రాజధాని అందులో ఏమేమి నిర్మాణం కాబోతున్నాయో, నిర్మాణాలకు నిధులు ఎలా సమకూర్చుకోవాలి, పరిపాలనా విధి విధానాలు ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలో తదితర విషయాలతో ప్రపంచ బ్యాంకు 118 పేజీలతో కూడిన పర్యావరణ, సామాజిక వ్యవస్థల నివేదికను విడుదల చేసింది. అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి ప్రపంచబ్యాంకు తన వ్యూహాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన విధి, విధానాలను అభివృద్ధి నమూనాను ఈ నివేదికలో తెలియజేసింది.