ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం
ఆస్ట్రేలియా పార్లమెంట్ గురువారం రాత్రి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. పిల్లల వయసు ధ్రువీకరణకు సామాజిక మాధ్యమాల వేదికలే ‘హేతుబద్ధమైన చర్యలు’ తీసుకోవాలని సూచించింది. ఇందుకు ఏడాది గడువు ఇచ్చింది. 
 
ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత వచ్చే ఏడాది నవంబరు నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్‌, స్నాప్‌చాట్‌, రెడిట్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలకు ఇది వర్తిస్తుంది. ఈ జాబితాలో యూట్యూబ్‌ను మాత్రం చేర్చలేదు. వయసు నిబంధనను చాలా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
వయసును ఏ విధంగా నిర్ణయించాలన్న బాధ్యతను సామాజిక మాధ్యమాలకే విడిచి పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఖాతాలు ప్రారంభించకుండా నిరోధించలేకపోతే సంబంధిత వేదికలకు 50 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (సుమారు రూ.280 కోట్లు) జరిమానాగా విధించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఎగువ సభ సెనేట్‌ ఆమోదించింది. 
 
ఈ విషయంలో అధికార లేబర్‌ పార్టీకి ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ బుధవారమే ఆమోదించడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని ఆంటోనీ అల్బనేసే మాట్లాడుతూ విపరీతంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న కారణంగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతోందని, అందువల్లనే నిషేఽధాన్ని విధిస్తున్నట్టు చెప్పారు.
 
ఇందుకు తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. మే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. పిల్లల వయసు నిర్ధారణకు బయోమెట్రిక్‌ను ఉపయోగిస్తారా, ప్రభుత్వం ఇచ్చే ధ్రువపత్రాలను వినియోగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై పలు సామాజిక మాధ్యమాలు పార్లమెంటుకు తమ అభిప్రాయాలు తెలిపాయి. 
 
వయసు నిర్ధారణ ప్రయోగాలు పూర్తయ్యే వరకు అమలును వాయిదా వేయాలని గూగుల్‌, మెటా సంస్థలు కోరాయి. మరింతగా సంప్రదింపులు జరపాల్సి ఉందని టిక్‌టాక్‌ కోరింది. ఈ బిల్లుకు ఈ వారంలోనే ఆమోదం తెలిపిన సెనేట్‌ కమిటీ పలు షరతులు పెట్టింది. వయసు ధ్రువీకరణకు పాసుపోర్టులు, డిజిటల్‌ ధ్రువీకరణ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడగకూడదని సూచించింది.