వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వివరించారు.
ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.
మరోవైపు శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ పొందినవారికి ప్రతి సేవకు భక్తులను మార్పు చేసుకునే అవకాశం లేదని తాజాగా సమావేశమైన టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. గతంలో టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు పాలకమండలి భక్తుల మార్పునకు అవకాశమిస్తూ తీర్మానం చేసింది. కానీ అప్పట్లో వచ్చిన వ్యతిరేకత వల్ల ఇది అమలు కాలేదు.
సాధారణ రోజుల్లో రూ.కోటి, శుక్రవారం రూ.కోటిన్నర విలువైన ఈ టికెట్‌ను తీసుకున్న భక్తుడు తన సంబంధీకులు ఐదుగురితో కలిసి శ్రీవారి సేవలను రోజంతా ప్రత్యక్షంగా సమీపంనుంచి వీక్షించే, పాల్గొనే భాగ్యం లభిస్తుంది. ఇందుకోసం ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారినే ఈ సేవకు అనుమతించేవారు. ఆ తర్వాత పలువురి అభ్యర్థనల మేరకు ముందుగా పేర్కొన్నవారు కాకుండా వారి స్థానంలో ఇతరులూ పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు.
అయితే వారి పేర్లనూ రెండు నెలల ముందే తెలపాలని 2013లో సమావేశమైన పాలకమండలి తీర్మానం చేసింది. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కరుణాకరరెడ్డి నేతృత్వంలోని పాలకమండలి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఉదయాస్తమాన సేవలో పాల్గొనే దాత తనతో వచ్చే ఐదుగురి పేర్లను ప్రతి సేవకు మార్చుకునేలా 2024 జనవరిలో తీర్మానించారు.
ఇది సేవాటికెట్ల బ్లాక్‌మార్కెట్‌కు అవకాశమిస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. విమర్శలతోపాటు పాలనాపరమైన కారణాలతో తీర్మానాన్ని అమలు చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ తీర్మానాన్ని పాలకమండలి పక్కన పెట్టింది.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్