సంభాల్ హింసాకాండలో ఎస్పీ ఎంపీపై కేసు

సంభాల్ హింసాకాండలో ఎస్పీ ఎంపీపై కేసు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్‌తోపాటు వందలాది మందిని నిందితులుగా పేర్కొన్నారు. 
 
బార్క్, సోహైల్ అక్కడి ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించినట్లు జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర పెన్సియా, సంభాల్‌ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఆరోపించారు. వారిద్దరితో సహా మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయని మీడియాతో పేర్కొన్నారు. వీడియో ఫుటేజీ ఆధారంగా వందలాది మంది అల్లర్ల నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు.

ఇప్పటికే నిషేధాజ్ఞలను విధించిన జిల్లా యంత్రాంగం నవంబర్ 30 వరకు సంభాల్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించింది. సంభాల్ తహసిల్‌లో ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేసిన జిల్లా యంత్రాంగం అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. షాహీ జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆదివారం పోలీసులతో తలపడిన సందర్భంగా జరిగిన ఘర్షణలలో

ముగ్గురు వ్యక్తులు మరణించగా భద్రతా సిబ్బంది, అధికారులతోసహా అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో వ్యక్తి సోమవారం మరణించడంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. బర్ఖ్, ఇక్బాల్‌తోసహా ఆరుగురితోపాటు 2,750 మంది గుర్తు తెలియని వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చినట్లు ఆయన చెప్పారు. 

ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశామని, ఇహింసతో సంబంధమున్న ఇతరులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నగరంలో శాంతి నెలకొందని, మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ సోమవారం కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయని ఆయన చెప్పారు.