భార‌త రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్

భార‌త రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్
భారత రాజ్యాంగానికి 75 ఏళ్ల నిండాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం .. రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్‌ను(https://constitution75.com) రూపొందించింది. హ‌మారా సంవిధాన్‌, హ‌మారా స్వాభిమాన్ టైటిల్‌తో .. భారత రాజ్యాంగ గురించి ఆ సైట్‌లో పొందుప‌రిచారు. వెబ్‌సైట్ యూఆర్ఎల్ అడ్ర‌స్ https://constitution75.com. రాజ్యాంగం 75 వార్షికోత్స‌వం మైలురాయిని సెల‌బ్రేట్ చేసుకునేందుకు .. రీడ‌ర్స్‌కు ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని ప్ర‌ద‌ర్శించారు. 
 
దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో రాజ్యాంగంపై చైత‌న్యం తీసుకువ‌చ్చేందుకు.. రాజ్యాంగ పీఠ‌క చ‌దువుకునే రీతిలో సైట్‌ను డిజైన్ చేశారు. రాజ్యాంగ పీఠిక‌ను చ‌దివిన పాఠ‌కులు.. త‌మ వీడియోల‌ను కూడా ఆ సైట్‌లో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఐక‌మ‌త్యాన్ని, గ‌ర్వాన్ని చాటేందుకు .. రాజ్యాంగ పీఠ‌క‌ను చ‌ద‌వాల‌ని ఆ సైట్‌లో కోరారు. వీడియోల‌కు అప్‌లోడ్ చేసిన‌వాళ్ల‌కు.. ఓ స‌ర్టిఫికేట్ కూడా ఇవ్వ‌నున్నారు. రాజ్యాంగ పీఠ‌క‌ను 19 భాషాల్లో ఆ సైట్‌లో పొందుప‌రిచారు.

భారత రాజ్యాంగాన్ని లిఖించ‌డానికి పూర్వం జ‌రిగిన చ‌ర్చ‌ల గురించి కూడా ఆ సైట్‌లో ఓ సెక్ష‌న్ పెట్టారు. దాంట్లో ఆ రోజుల్లో జ‌రిగిన చ‌ర్చ‌ల‌కు సంబంధించిన పుస్త‌కాల‌ను అప్‌లోడ్ చేశారు. ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో ఆ చ‌ర్చ‌ల‌కు చెందిన పుస్త‌కాలు ఉన్నాయి. ఆ బుక్స్‌ను ఆన్‌లైన్‌లోనే చ‌దువుకోవ‌చ్చు. రాజ్యాంగ నిర్మాణ స‌మ‌యంలో జ‌రిగిన వివాదాల గురించి కూడా బుక్స్ ఉన్నాయి. అన్నీ బుక్స్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో పోస్టు చేశారు.

చేతి రాత‌తో రాసిన రాజ్యాంగ పుస్త‌కాన్ని కూడా సైట్‌లో పోస్టు చేశారు. ప‌లు భార‌తీయ భాష‌ల్లో ఆ చేతి రాత పుస్త‌కాల‌ను అప్‌లోడ్ చేశారు. భార‌త సంవిధానం పేరుతో తెలుగు బుక్‌ను కూడా సైట్‌లో పెట్టారు. రాజ్యాంగ గురించి తెలుసుకునే రీతిలో ప్ర‌శ్న‌లు వేసే సెక్ష‌న్ కూడా ఉన్న‌ది. రాజ్యాంగం గురించి ఏదైనా ప్ర‌శ్న వేయాల‌నుకుంటే, ఆ కాల‌మ్‌లో ప్ర‌శ్నిస్తే దానికి స‌మాధానం వ‌స్తుంది.

75వ వార్షికోత్సం సంద‌ర్భంగా ఏడాది పాటు రాజ్యాంగ దినోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేసుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రామ పంచాయ‌తీలు, స్కూళ్లు, కాలేజీ.. అన్ని స్థాయిలో వివిధ కార్య‌క్ర‌మాల‌ను రూపొందించ‌నున్నారు. ఆ కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను కూడా సైట్‌లో పొందుప‌రిచారు. రాజ్యాంగం సైట్‌ను యాక్సెస్ చేసుకునేందుకు .. లాగిన్ డిటేల్స్‌ను జ‌న‌రేట్ చేయాల్సి ఉంటుంది.