ఇస్రో శుక్రయాన్‌కు కేంద్రం అనుమతి

ఇస్రో శుక్రయాన్‌కు కేంద్రం అనుమతి
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వీనస్‌తో పాటు గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3 ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నది. 2028లో ఇస్రో శుక్రయాన్‌ మిషన్‌ ప్రయోగించనుండగా, ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ తెలిపారు. 
 
సింథటిక్ ఎపర్చర్‌ రాడార్‌, ఆల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ సిస్టమ్‌ తదితర అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలతో శుక్రుడి వాతావరణంపై పరిశోధన జరుపనున్నది. దట్టమైన కార్బన్‌డయాక్సైడ్‌, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించడంతో పాటు గ్రహం భౌగోళిక కార్యకలాపాలను అంచనా వేయడం మిషన్‌ ముఖ్య లక్ష్యాల్లో ఒకటి. 
 
చంద్రయాన్-3 విజయం తర్వాత జపాన్‌తో కలిసి చంద్రయాన్-4 ఇస్రో చేపట్టనున్నది. ఈ ప్రాజెక్టులో చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకునేలా ప్రయోగం చేపట్టబోతున్నది. ఈ మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపితే 2030 నాటికి మిషన్‌ను నిర్వహించగలుగనున్నట్లు నీలేశ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మిషన్‌ శాస్త్రీయ ప్రాముఖ్యతను వివరించారు. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మంగళ్‌యాన్‌) సాధించిన విజయాల ఆధారంగా ఇస్రో మార్స్‌ ప్రోగ్రామ్‌ను సైతం విస్తరిస్తున్నది. రాబోయే దశలో రెడ్‌ ప్లానెట్‌ చుట్టూ పరిభ్రమించడంతో పాటు ఉపరితలంపై ల్యాండింగ్‌కు ప్రయత్నించనున్నట్లు పేర్కొన్నారు. 
మార్స్‌ మిషన్‌లో ఓ ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలో ఉంచడంతో పాటు ఉపరితలంపై ల్యాండింగ్‌కు ప్రయత్నాలు చేస్తామని వివరించారు.
ఆ గ్రహంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. అలాగే, గగన్‌యాన్‌లో కీలకమైన మైలురాయిని చేరుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తొలిసారిగా గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా ఆస్ట్రోనాట్స్‌ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నది. రాబోయే రెండేళ్లలో మిషన్‌ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇన్‌శాట్‌-4ని భాగంగా వాతావరణ, సముద్రంపై పరిశోధనలను మెరుగుపరిచేందుకు కొత్త సెన్సార్లతు ఉపగ్రహాలను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఇన్‌శాట్‌-4 సిరీస్‌లో భాగంగా ప్రయోగించనున్న కొత్త సెన్సార్లు, ఉపగ్రహాలపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇక తొలిసారిగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది ఐఎస్‌ఎస్‌ కంటే చిన్నగా ఉంటుంది. ఇస్రో స్పేస్‌ సెంటర్‌లో ఐదు మాడ్యూల్స్‌ ఉంటాయి. తొలి మాడ్యూల్‌ 2028లో ప్రారంభించనున్నారు. పూర్తి స్టేషన్‌ నిర్మాణం 2035 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.