ప్రజా పాలన విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు

ప్రజా పాలన విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ వి ప్రజా పాలన విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలని బీజేపీ శాసనసభ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే రాష్ట్రం ఏ రకంగా దివాళా తీస్తుందో, పాలన అస్తవ్యస్తంగా మారుతుందో రేవంత్ రెడ్డిని ఒక ఉదాహరణగా చెప్పొచ్చని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ప్రజలకు చెప్పుకునేది ఏమీ లేదని ఆయన తెలిపారు. అందుకనే కాంగ్రెస్ విజయోత్సవాల సభలో రేవంత్ రెడ్డి ఏదోరకంగా ప్రతిపక్షాలపై దాడి చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై అభాండాలతో విరుచుకుపడ్డారని ఆయన మండిపడ్డారు.

అసలు నరేంద్ర మోదీ పేరు కూడా ఉచ్చరించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి గారు మోదీ గారికి బానిస అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అసలు ఆయన ఎవరికి బానిసో గుర్తుతెచ్చుకోవాలని హితవు చెప్పారు. రేవంత్ రెడ్డి అదే సభలో సోనియా గాంధీ కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని చెప్పారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.

ఆయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు కాబట్టే సోనియా గాంధీ కాళ్లు కడిగి ప్రసన్నం చేసుకుంటున్నడని బిజెపి నేత ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని సంబోధించి, ఈరోజు తన పదవిని కాపడుకోవడం కోసం సోనియా కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని వ్యాఖ్యానిస్తున్నరంటే ఎంతకు దిగజారారో తెలుస్తున్నదని చెప్పారు.

ఖబడ్దార్ రేవంత్ రెడ్డి… అవినీతిలో కూరుకుపోయిన మీరు… నరేంద్ర మోదీ గురించి, బిజెపి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం అనాలోచితంగా రూపొందించిన ఏపీ పునర్విభజన బిల్లును ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నష్టం జరగకుండా రూపొందించి ఉండాల్సిందని మాత్రమే ప్రధాని మోదీ మాట్లాడారు తప్పితే.. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.

పునర్విభజన చట్టం విషయంలో బిజెపి గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో అభాసుపాలుకావొద్దని ఆయన హితవు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో, ఏం సాధించారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో అవకాశవాదాలకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

యువత, రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుకుంటున్నట్లు? అని బిజెపి నేత ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి, ఎగవేతల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుతెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. .

ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం 6 గ్యారంటీలపై పెట్టి, చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండని, బాండ్ పేపర్ తో ప్రజల్లోకి వెళ్లిండని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించని రేవంత్ రెడ్డి అసమర్థ సీఎం కాదా? అని ప్రశ్నించారు.

రేవంత్ సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరుతో గిరిజన బిడ్డలు, రైతుల భూములు గుంజుకోవడానికి చేస్తున్న అరాచకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నరని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. లంకెబిందల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలను హింసిస్తున్నడని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుందన్నారని, అయితే  రాష్ట్రాన్ని మరింత అప్పులపాల్జేశారని చెబుతూ  ఇదేనా మార్పు అంటే? అని నిలదీశారు.

ఆయా శాఖలవారీగా నెరవేర్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఎక్కడ చర్చించేందుకైనా తాము సిద్ధమని సవాల్ చేశారు. 11 నెలల్లో 75 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకునేది? అంటూ ఎద్దేవా చేశారు.

చెరువుల పరిరక్షణ పేరుతో హైడ్రాతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్లను కూలగొట్టినందుకేనా కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటున్నది? మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలు, దళితులు కట్టుకున్న ఇండ్లు కూల్చినందుకా? మూసీ సుందరీకరణ పేరుతో లక్షా 50 వేల కోట్లకు అంచనాలు పెంచి, మీ ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపేదుకేనా విజయోత్సవాలు చేసుకుంటున్నది? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాటు తుగ్లక్ పాలన పూర్తి చేసుకున్నడని ధ్వజమెత్తారు.