పాకిస్తాన్ పౌరులకు యూఏఈ వీసాలు బంద్

పాకిస్తాన్ పౌరులకు యూఏఈ వీసాలు బంద్

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాకిస్తాన్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. దాంతో పాక్‌ పౌరులు, యూఏఈకి వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు సైతం యూఏఈ వీసాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లుగా యూఏఈలోని పాకిస్థాన్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ సైతం అంగీకరించారు. 

తమకు యూఏఈ వీసాలు రావడం లేదని పాకిస్థాన్‌లోని సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో యూఏఈలోని పాకిస్థాన్ ఎంబసీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుంచి ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాక్‌ రాయబారి ఫైసల్‌ నియాజ్‌ తిర్మిజీ మాట్లాడుతూ పాకిస్థానీలకు వీసాల జారీలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

వీసాలు తీసుకువాలంలో రిటర్న్‌ టికెట్లతో పాటు హోటల్‌ బుకింగ్స్‌, 3వేల దిర్హామ్‌లు ఉండాలి. వాస్తవానికి పాక్‌ పౌరులు యూఏఈకి వెళ్తూ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నకిలీ పత్రాలతో ప్రయాణించడంతో పాటు యూఏఈలో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఆయా అంశాల ఆధారంగా పాకిస్థాన్ పౌరులపై నిషేధం విధించాలని యూఏఈ కేబినెట్ ప్రతిపాదించింది. 
 
ఈ విషయాన్ని పాక్ రాయబార కార్యాలయం ఇస్లామాబాద్‌కి అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఇందులో పాకిస్థానీ జాతీయులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం.. దేశంలోని నిరసనలు చేయడం ఎమిరాటీ చట్టాలను ఉల్లంఘించడమేనని యూఏఈ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. యూఏఈ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కొందరు సోషల్‌ మీడియా వేదికగా పాకిస్థానీలు చేసిన పెట్టిన పోస్టులు దీనికి మరింత ఆజ్యం పోశాయి. 
 
నకిలీ డిగ్రీలు, ఫేక్‌ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్‌లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రవాస దేశీయులతో పోలిస్తే దొంగతనాలు, మోసం, భిక్షాటన, వ్యభిచారం, మాదకద్రవ్యాల సంబంధిత నేర కార్యకలాపాల్లో పాకిస్థాన్‌ జాతీయుల ప్రమేయం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భద్రతతో పాటు యూఏఈ జీరో టాలెర్స్‌ విధానం ఈ సమస్యల తీవ్రతను నొక్కి చెబుతుందని.. ఆయా అంశాలపై కేబినెట్‌లో చర్చించి.. పాకిస్థానీ పౌరులకు వీసాలపై ఆంక్షలు విధించినట్లు యూఏఈ పేర్కొంది.