* ఓటేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఒకే దశలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని అధికారులు కోరారు. ప్రజలు తమ బాధ్యతాయుతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని దాదాపు 9.7 కోట్ల మంది ఓటర్లకు సరిపడేలా 52,789 స్థానాల్లో 1,00,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో 388 “పింక్ బూత్‌లు” ప్రత్యేకంగా మహిళలచే నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్య వేడుకల కార్యక్రమాన్ని మరింత పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ సందర్భంగా యువత, మహిళా ఓటర్లందరూ ఉత్సాహంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బాధ్యత అని, ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలని భగవత్ కోరారు. తాను ఉత్తరాంఛల్లో ఉన్నా, ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, రాజ్‌భవన్ వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్లో ఓటేశారు. “భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం సీనియర్ పౌరులు, మహిళలు ఓటు వేయాలని నేను అప్పీల్ చేస్తున్నాను. వారికి నచ్చినవారికి ఓటర్లు ఓటు వేయొచ్చు, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలి. ఇది పౌరుల ప్రాథమిక బాధ్యత” అని రాధాకృష్ణన్ అన్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బారామతి ఎన్సీపీ అభ్యర్థి అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతి ఓటర్లు భారీ మెజారిటీతో తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు 4,140 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య 28 శాతం పెరిగింది. ఈ ఏడాది 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా, 2019లో ఆ సంఖ్య 3,239కి చేరింది. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు. 150కి పైగా నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు ఉన్నారు.
తిరుగుబాటు అభ్యర్థులు మహాయుతి, ఎంవిఎ అధికారిక అభ్యర్థులపై పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, నానా పటోలే, పృథ్వీరాజ్ చవాన్, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలా సాహెబ్ థోరట్, నసీమ్ ఖాన్, ఆదిత్య థాకరే, అమిత్ థాకరే, నవాబ్ మాలిక్, జీషన్ సిద్ధిఖీ వంటి ప్రముఖులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో రెండు కూటముల మధ్యే కాకుండా రెండు శివసేన, రెండు ఎన్సీపీల మధ్య కూడా పోటీ నెలకొంది. మహారాష్ట్రలోని 37 స్థానాల్లో మామ శరద్ పవార్, మేనల్లుడు అజిత్ పవార్ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో శరద్ ఎన్సీపీ 86 మంది అభ్యర్థులను నిలబెట్టగా, అజిత్ ఎన్సీపీ కూడా 59 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్‌సీపీలో తిరుగుబాటు తర్వాత, శరద్ పవార్‌ను విడిచిపెట్టి అజిత్‌లో చేరిన 40 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా