హిజాబ్ ధిక్కరించే వారికి ఇరాన్ లో ప్రత్యేక క్లినిక్‌లు

హిజాబ్ ధిక్కరించే వారికి ఇరాన్ లో ప్రత్యేక క్లినిక్‌లు

హిజాబ్ ధరించడానికి నిరాకరించినందుకు ఇరాన్‌లోని క్యాంపస్‌లో యూనివర్శిటీ విద్యార్థిని తొలగించిన వారం రోజుల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్‌లో కలకలం రేగింది. వివిధ మీడియా నివేదికల ప్రకార హిజాబ్ చట్టాలను ధిక్కరించే మహిళల కోసం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ఇరాన్ యోచిస్తోంది.

‘హిజాబ్‌ రిమూవల్‌ ట్రీట్‌మెంట్‌ క్లినిక్‌’ పేరుతో ప్రభుత్వ చికిత్సా కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మహిళా, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధిపతి మెహ్రీ తలేబీ దరేస్తానీ ప్రకటించినట్లు ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్’ వెల్లడించింది. హిజాబ్ ధరించకపోవడం ఒక వ్యాధి అని, దీనిని తొలగించడానికి క్లినిక్ ద్వారా శాస్త్రీయ, మానసిక చికిత్స అందించడం జరుగుతుందని ఇరాన్ పేర్కొంది.

క్యాంపస్‌లో బట్టలు విప్పి నిరసన తెలిపిన విద్యార్థినిని అరెస్టు చేసి మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, హిజాబ్ ధరించనందుకు సెక్యూరిటీ గార్డులు కొట్టడంతో ఆ బాలిక యూనివర్సిటీ క్యాంపస్‌లో నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశం లోపలా, వెలుపలా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 

ఇరాన్ మానవ హక్కుల న్యాయవాది హోస్సేన్ రైసీ ఈ ఆలోచనను తీవ్రంగా విమర్శించారు, హిజాబ్ ధరించడానికి నిరాకరించే మహిళలకు చికిత్స చేసే క్లినిక్ “ఇస్లామిక్ లేదా ఇరాన్ చట్టానికి అనుగుణంగా లేదు” అని ఆమె పేర్కొన్నారు. మహిళల హక్కులను అణిచివేసేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నిర్ణయం అని మహిళా హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హిజాబ్ ధరించని వారందరూ మూర్ఖులని, అక్రమార్కులేనని తేల్చిచెప్పే విధంగా ఈ నిర్ణయం వుందని, హిజాబ్ ధరించని మహిళలను చికిత్స కోసం కాకుండా జైలుకు పంపే కేంద్రంగా కూడా ఇది పనిచేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. నిరసనకారులను మానసిక రోగులుగా పేర్కొనడం, హింసించడం, బలవంతంగా చికిత్స చేయడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి