బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని చెప్పడం అవివేకం

బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని చెప్పడం అవివేకం

గవర్నర్ నుంచి అనుమతి ఆలస్యం అయినంత మాత్రాన బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని చెప్పడం అవివేకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధోరణిపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  

రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా న్యాయపరమైన సలహా తీసుకుంటారని, ఆ క్రమంలోనే కెటిఆర్‌ను విచారించేందుకు గవర్నర్ నుంచి అనుమతి రావడంలో కొంత జాప్యం జరిగి ఉండవచ్చునని ఆయన చెప్పారు. అయితే తొందరపాటుతో అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయాలని తామే డిమాండ్ చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ విచారణ కోరలేదని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాభివృద్ధి వదిలేసి స్వంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. 

వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి విమర్శించారు. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణకు ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్‌కు మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు.

కలెక్టర్ మీద దాడి చేయడం తప్పు అన్న కిషన్‌రెడ్డి గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని హితవు చెప్పారు. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కెటిఆర్‌ను విచారించేందుకు గవర్నర్ నుంచి అనుమతి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన తన ప్రజలతో మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందని కితాబిచ్చారు.

కాగా, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో బొగ్గు శాఖ, గనుల శాఖ విడివిడిగా పెవిలియన్లు ఏర్పాటు చేశాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కోల్ ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారని, ఇది ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. బొగ్గు వెలికితీత ముగిసిన తర్వాత ఆ గనులను పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడేలా ఎలా తీర్చిదిద్దాలి అన్న విషయంపై పనిచేస్తున్నామని ఆయన వివరించారు. 

బొగ్గు పరిశ్రమలో ప్రమాదాలు లేకుండా కార్మికుల క్షేమమే ప్రధాన ఎజెండాగా కార్యక్రమాలు రూపొందించామని చెబుతూ  వచ్చే ఏడాది అక్టోబర్ వరకు కోల్ ఇండియా ఫౌండేషన్ డే ఉత్సవాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సముద్ర గర్భంలో ఉన్న ఖనిజాల వెలికితీత కోసం వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, లిథియం విషయంలో ఆస్ట్రేలియా, అమెరికా, అరబ్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

 దేశ అవసరాలకు 95 శాతం రాగి దిగుమతులు చేసుకుంటున్నామని, నిత్యజీవితంలో కాపర్ వినియోగం ఉంటుందని తెలిపారు. కాపర్ సహా అనేక ఖనిజాలు, ధాతువులు, క్రిటికల్ మినరల్స్ విషయంలో ఆత్మనిర్భర్, స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. క్రిటికల్ మినరల్స్‌లో లిథియం ఒకటని, దాన్ని వెలికితీయడం కష్టతరమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కాబిల్ సంస్థను ఏర్పాటు చేశామని, ఈ సంస్థ వివిధ దేశాలు సందర్శించి లిథియం నిక్షేపాల వెలికితీత గురించి తెలుసుకుంటుందని చెప్పారు.