కాగా, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని అభ్యర్థి నరేష్ మీనా కొట్టడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం అతడ్ని అరెస్ట్ చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. అయితే తాను లొంగిపోనని మీడియాతో మీనా చెప్పాడు. అలాగే పోలీసులను చుట్టుముట్టాలని, రోడ్డును బ్లాక్ చేయాలని తన మద్దతుదారులను ఉసిగొల్పాడు.
మరోవైపు పోలీసులు ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టారు. అల్లర్ల నిరోధక వాహనాలతో ఆ గ్రామానికి చేరుకున్నారు. షీల్డ్‌లు, రక్షణ దుస్తులు, హెల్మెట్‌లు ధరించిన పోలీసులు లాఠీలతో వచ్చారు. టైర్లతో మంటలు పెట్టి బ్లాక్ చేసిన రోడ్డును దాటి ముందుకు వెళ్లారు. పదుల సంఖ్యలో పోలీసులు నరేష్ మీనాను చుట్టుముట్టి అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీస్ రక్షణ వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ హైడ్రామాకు చెందిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈవీఎం మెషీన్లో తన ఎన్నికల గుర్తు సరిగ్గా కనిపించట్లేదని స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎస్డీఎం అమిత్, నరేశ్ మీనా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన నరేశ్ మీనా డీసీఎం అమిత్ చెంపపై కొట్టారు.
అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల సమ్రావ్త గ్రామంలో ధర్నాకు దిగి, కర్రలు చేత పట్టుకుని రావాలని తన అనుచరులను కోరారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై మీనా, అతని అనుచరులు దాడి చేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
మీనా అనుచరుల రాళ్లదాడిలో జితేంద్ర చావ్లా, మహిపాల్, ముఖేశ్ అనే ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసు జీపులతో సహా పలు వాహనాలకు నిప్పు పెట్టారు.
“సమ్రావ్త గ్రామస్థులు ఉప ఎన్నికను బహిష్కరిస్తామని ప్రకటించారు. నరేశ్ మీనా వారికి మద్దతు ప్రకటించారు. సమ్రావ్త గ్రామం ప్రస్తుతం నగర్ ఫోర్ట్ తహసీల్దారు పరిధిలోకి వస్తుంది. అయితే గ్రామస్థులు దీన్ని ఉనియారాకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎస్డీఎం అమిత్ ఉపఎన్నికల్లో ఓట్లు వేయాలని గ్రామస్థులను ఒప్పించేందుకు వెళ్లారు. ఆయనపై నరేశ్ మీనా దాడి చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేసిన తర్వాత ఈ విషయంపై విచారణ చేపడతాం” అని టోంక్ జిల్లా కలెక్టర్ సౌమ్య ఝా తెలిపారు.
కాగా, ఎస్డీఎం అమిత్‌పై దాడిని రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ ఖండించింది. అధికారిపై దాడి చేసిన నరేశ్ మీనాను గురువారం ఉదయంలోపు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే సమ్మె బాట పడతామని హెచ్చరించింది.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం