అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ యూఎస్ కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందువు అయిన తులసీ గబ్బార్డ్‌ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. తులసీ గబ్బార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ అభివర్ణించారు. తులసీ గబ్బార్డ్‌కు రెండు పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా దేశం కోసం, అమెరికన్ల స్వాతంత్య్రం కోసం తులసి పనిచేసినట్లు ట్రంప్ తెలిపారు. నిఘా యంత్రంగాన్ని నిర్భయంగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ తన బలమైన వ్యక్తిత్వంతో ఆమె శాంతిని తీసుకొస్తారని ట్రంప్ ఆకాంక్షించారు.
తులసి గబ్బార్డ్ ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో భాగస్వాములయ్యారు. తులసి గబ్బర్డ్ దాదాపు రెండు దశాబ్దాలు యూఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్‌లో సేవలందించారు. ఇరాక్, కువైట్‌లోనూ పని చేశారు. అయితే, ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు.
తులసి గబ్బార్డ్ 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంటు సభ్యురాలు. ఆమెకు భారత్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. కానీ, ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించారు. దాంతో ఆమె తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. తులసి గబ్బర్డ్ సైతం హిందూ మతాన్ని విశ్వసిస్తారు. ఆమె పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు.
నాలుగుసార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన తులసి, 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొకట్రిక్ అభ్యర్థిగా పోటీకి యత్నించారు. పశ్చిమాసియా, ఆఫ్రికాల్లోని యుద్ధక్షేత్రాల్లో మూడుసార్లు అమెరికా సైన్యం తరపున ఆమె పనిచేశారు. ఇక అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు పలికారు. డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్‌ని సిద్ధం చేసింది తులసీ గబ్బార్డ్.
2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తులసి గబ్బర్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించిన సమయంలో కమలా హారిస్ సైతం రేసులో నిలిచారు. తులసి గబ్బార్డ్, కమలా హారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. ఇందులో తులసీ పేరు ప్రధానంగా వినిపించింది.
గత ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్‌ను సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబ్బార్డ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల తర్వాత తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ట్రంప్ ఆమెను యూఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు