అమెరికా రక్షణ మంత్రిగా ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ పీట్‌ హెగ్‌సేత్‌

అమెరికా రక్షణ మంత్రిగా ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ పీట్‌ హెగ్‌సేత్‌
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందే ఆయన టీమ్‌ని ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సారి కేబినెట్‌లో కొత్త ముఖాలకు చోటివ్వనున్నట్లు తెలుస్తున్నది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్‌ మస్క్‌తో పాటు పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి, ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ పీట్‌ హెగ్‌సేత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
 
 ట్రంప్‌ 2.O కేబినెట్‌లో ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ పీట్‌ హెగ్‌సేత్‌ చోటు దక్కింది. ఆయనకు రక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నారు. పీట్ ట్రంప్‌కు మద్దతుదారు. కేబినెట్‌లో డిఫెన్స్‌ పీట్‌ హెగ్‌సేత్‌ను ఎంపిక చేసినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.  తన జీవితమంతా సైనికులు, దేశం కోసం పని చేశారన్నారు. మన సైన్యం మళ్లీ గొప్పగా ఉంటుందని, అమెరికా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ట్రంప్‌ తెలిపారు.
 
 స్టీవెన్ విట్‌కాఫ్ మిడ్ ఈస్ట్ ప్రతినిధిగా నియమితులయ్యారు. అలాగే, డొనాల్డ్ ట్రంప్ తన కేబినెట్‌లో ఎలాన్ మస్క్‌కు కూడా చోటు కల్పించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మొదటి ప్రసంగంలో, కొత్త ప్రభుత్వంలో ఎలోన్ మస్క్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించనున్నట్లు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చేసిన ప్రసంగంలో మస్క్‌తో పాటు స్పేస్‌ఎక్స్‌ కంపెనీని సైతం ప్రశంసలతో ముంచెత్తారు. 
 
ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో పాటు ఆయన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బ్యూరోక్రసీని తొలగించడం, అనవసరమైన నిబంధనలను తొలగించడం, ఖర్చులను తగ్గించడంతోపాటు ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించేందుకు మస్క్, రామస్వామి కృషి చేస్తారని ట్రంప్ పేర్కొన్నారు.ఇక సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. క్రిస్టి 2018లో తొలిసారిగా సౌత్ డకోటాకు తొలి మహిళా గవర్నర్‌గా నియామకయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలో నోయెమ్ ఇటీవల యూఎస్‌ బోర్డర్ జార్‌గా ఎన్నికైన టామ్ హోమన్‌తో కలిసి పని చేయనున్నారు. బోర్డర్ జార్ యూఎస్‌ పరిపాలనలో ఉన్నత అధికారుల్లో ఒకరు. 

ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జోహన్ రాట్‌క్లిఫ్‌ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఏ) డైరెక్టర్‌గా నియమించారు. వైట్ హౌస్ కౌన్సెల్‌గా విలియం జోసెఫ్ మెక్‌గిన్లీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తన మద్దతుదారుల్లో ఒకరైన లీ జెల్డిన్‌కు పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఎ) పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఏజెన్సీలోని కఠినమైన నిబంధనలను రద్దు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. 

అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 50.3 శాతం ఓట్లతో మొత్తం 312 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు కేవలం 226 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు (48.1 శాతం ఓట్లు) మాత్రమే వచ్చాయి. ఓట్ల పరంగా చూస్తే ట్రంప్‌కు మొత్తం 7.51 కోట్లకుపైగా ఓట్లు రాగా.. కమలా హారిస్‌కు 7.18 కోట్లకుపైగా పోలయ్యాయి.