పాక్ ప్లేయర్లకు భారత్ వీసాలు నిరాకరణ

పాక్ ప్లేయర్లకు భారత్ వీసాలు నిరాకరణ

ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదిక గురించి వివాదం చెలరేగడంతో  పీసీబీ, ఐసీసీ, బీసీసీఐ మధ్య తీవ్రంగా మాటామంతీ జరుగుతుండగా త్వరలోనే జరగబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, డిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం ఆడనున్న చాలా మంది పాక్ ప్లేయర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది.

ఓవైపు పీసీబీ తమ దేశానికి టీమ్ ఇండియా రావాలని మొండి పట్టుబడుతుంటే, మరోవైపు వచ్చేదే లేదని కరాఖండిగా చెబుతోంది భారత్. దీంతో వ‌చ్చే ఏడాది జ‌రగ‌బోయే ఈ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. అస‌లు ఏం జ‌రుగుతోందో? ట్రోఫీ నిర్ణయిస్తారా లేదా అని తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ వ్యవహరం ఇది కొనసాగుతున్నవేళ భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు గట్టి షాక్ ఇచ్చింది. త్వరలోనే జరగబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం ఆడనున్న చాలా మంది పాక్ ప్లేయర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది. వాస్తవానికి పాక్ ప్లేయర్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించారు. కానీ వాటిని భారత హైకమిషన్‌ చూసిచూడనట్లుగా వదిలేసింది. ఇప్పుడేమో తాజాగా ఆ ఆటగాళ్లకు వీసాలు జారీ చేయమని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడీ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.

 వీసాల జారీ చేయం అంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ స్పందించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమ్లోని చాలా మంది ప్లేయర్లకు ఎలాంటి వివరణ లేకుండానే వీసా నిరాకరించినట్లు తారిక్ వెల్లడించారు. 

“గత ఏడాది భారత్‌లో పోటీ పడి మరీ గెలుపొందిన ప్లేయర్స్తో పాటు జట్టులోని సగం మందికి అస్సలు ఎలాంటి వివరణ లేకుండా వీసాలను నిరాకరించారు. ప్రపంచ యూత్ ఛాంపియన్‌, ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ముద్దాడిన పాకిస్థాన్ జట్టు గైర్హాజరు కావడం టోర్నమెంట్‌కు గట్టి ఎదురు దెబ్బ” అని తారిక్ పేర్కొన్నారు.

కాగా, భార‌త జ‌ట్టును పాకిస్థాన్‌కు పంప‌బోమ‌ని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) స్ప‌ష్టం చేయడంతో న‌వంబ‌ర్ 11న జ‌ర‌గాల్సిన‌ మెగా టోర్నీ ఈవెంట్‌ను ఐసీసీ ర‌ద్దు చేసింది. చాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై అనిశ్చితికి తెర‌దించే ప్ర‌య‌త్నాల్లో మునిగిన ఐసీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈసారి చాంపియ‌న్స్ ట్రోఫీ సజావుగా సాగాలంటే హైబ్రిడ్ మోడ‌ల్ ఒక్క‌టే మార్గ‌మ‌ని ఐసీసీ భావిస్తోంది. 

ఒక‌వేళ అందుకు కూడా పీసీబీ అంగీక‌రించ‌కంటే వేదిక‌ను త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. బంగ్లాశ్‌లో అల్ల‌ర్ల కార‌ణంగా మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను యూఏఈలో జ‌రిపిన‌ట్టే.. చాంపియ‌న్స్ ట్రోఫీ వేదిక‌ను ద‌క్షిణాఫ్రికాకు త‌ర‌లించే ఆలోచ‌న‌లో ఉంది ఐసీసీ. ఒక‌వేళ అదే జ‌రిగితే సొంత‌గ‌డ్డ‌పై పూర్తి స్థాయిలో ఐసీసీ ట్రోఫీ జ‌రిపి తీరాల‌నుకుంటున్న పీసీబీకి దిమ్మ‌దిరిగే షాక్ త‌గిలిన‌ట్టే.

ఊహించ‌ని ప‌రిణామంతో దిక్కుతోచ‌ని స్థితిలో పడిపోయిన మొహ్సిన్ న‌ఖ్వీ బృందం ఐసీసీని ఆశ్ర‌యించింది. భార‌త జ‌ట్టు త‌మ దేశానికి రాక‌పోవ‌డానికి కార‌ణాలు ఏంటీ?, అసలు బీసీసీఐ ఏయే అభ్యంత‌రాలు చెప్పింది?.. ఆ వివ‌రాలు కాస్త‌ మాకు చెప్పండి అని ఐసీసీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరింది.

‘చాంపియ‌న్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు భార‌త జ‌ట్టును పంప‌డం లేద‌ని బీసీసీఐ నిర్ణ‌యంపై స్పంద‌న తెలియ‌జేయాల‌ని పీసీబీకి గ‌త వారం ఐసీసీ లేఖ రాసింది. ఆ ఉత్త‌రంపై తాజాగా పీసీబీ స్పందించింది’ అని పీసీబీ మీడియా ప్ర‌తినిధి తెలిపాడు. ఐసీసీకి రాసిన ప్ర‌త్యుత్త‌రంలో టీమిండియా భ‌ద్ర‌త‌కు ఢోకా ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈమ‌ధ్యే త‌మ దేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు ప‌ర్య‌టించిన విష‌యాన్ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు హైబ్రిడ్ మోడ‌ల్ లేదా ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా చాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌పాల‌ని చూస్తే టోర్నీ నుంచి వైదొలిగేందుకు సిద్ధ‌ప‌డుతామ‌ని కూడా చెప్పినట్టు సమాచారం. బీసీసీఐ నిర్ణ‌యం, ఐసీసీ లేఖ నేప‌థ్యంలో త‌దుప‌రి ఏం చేయాల‌నే విష‌య‌మై పాకిస్థాన్ ప్ర‌భుత్వం స‌ల‌హా తీసుకోవాల‌ని పీసీబీ అనుకుంటోంది.