రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మొదటి సారి ఓ రాజకీయ నేతకు నోటీసులు జారీ చేశారు. బిఆర్‌ఎస్ నేత, నకరేకల్ మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపారు. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపంగా సోమవారం మధ్యాహ్నం 2.30కి హాజరవుతానని ముందుగా వెల్లడించారు.
కానీ అనారోగ్యంగా ఉందని ఈనెల 14న విచారణకు హాజరవుతానని దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్ ఎసిపి వెంకటగిరికి సమాచారం ఇచ్చారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ నలుగురు నిందితులైన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా నలుగురి నిందితుల ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించి విశ్లేషించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా నిందితులు తరచూ పలువురు ప్రముఖులతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి అనుచరునిగా ఉండే లింగయ్య తర్వాత బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయనకు సాక్షిగా నోటీసులు జారీ చేశారా? లేకపోతే నిందితుడిగానా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పోన్ ట్యాపింగ్ బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృతంగా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ చేసిన పరికరాలన్నీ ధ్వంసం చేశారని గుర్తించి కేసులు పెట్టారు. ఈ క్రమంలో అరెస్టు అయిన పోలీసు అధికారులు ఇంకా జైలులోనే ఉన్నారు. ఎ1గా ఉన్న ఇంట లిజెన్స్ మాజీ ఓఎస్‌డి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. కేసు నమోదు కాక ముందే వైద్య చికిత్స కోసం వెళ్లిపోయిన ఆయన ఇప్పటి వరకూ తిరిగి రాలేదు.
ఆయన కోసం పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభాకర్ రావు వస్తే ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అంతా అనుకున్నారు. అయితే అమెరికాలో ఆయన పెట్టుబడి పెడితే వచ్చే గ్రీన్ కార్డు కోసం ధరఖాస్తు చేసుకున్నారని ఆయన తిరిగి రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో పోలీసులు ఆయన గురించి పక్కన పెట్టేసి కేసులో ఉన్న ఇతర ఆధారాల ప్రకారం రాజకీయ నేతల్ని విచారణకు పిలిపించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు మాజీ అదనపు ఎస్‌పి తిరుపతన్నతో ఫోన్ కాంటాక్ట్ ఉండటంతో జూబ్లీహిల్స్ ఎసిపి ఎదుట విచారణకు హాజరు కావాలని లింగయ్యకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. లింగయ్య విచారణ ఆధారంగా మరికొంత మందిని కూడా పోలీసుల విచారించనున్నారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు