విజయవాడ- శ్రీశైలం సీప్లేన్ సేవలు ప్రారంభం

విజయవాడ- శ్రీశైలం సీప్లేన్ సేవలు ప్రారంభం
 
ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీప్లేన్ ప్రయాణించారు. దేశంలో తొలిసారిగా పర్యాటకంగా ‘సీప్లేన్’ సర్వీసులను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
 
ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ లో 14 మంది ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నారు. సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి టూరిజం ఒక వరమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, సంపద పెంచి, ఆ సంపద పేదలకు పంచాలి అనేది కూటమి ప్రభుత్వం విధానం తెలిపారు.

“నేను నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాను. కానీ, గత మూడు సార్లు ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ, ఈ సారి మాత్రం మొత్తం విధ్వంసం అయిన వ్యవస్థని గాడిలో పెట్టటానికి చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే వెనక్కు తగ్గేది లేదు. గాడి తప్పిన వ్యవస్థలని, గాడిలో పెట్టే దాకా నిద్రపోను” సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

భవిష్యత్‌లో ఏ ఇజం ఉండదని, టూరిజం ఒక్కటే ఉంటుందని ఆయన చెప్పారు. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతోందని, దానిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.  రానున్న రోజుల్లో ఎయిర్ పోర్టుల్లోనే కాకుండా సీప్లేన్‌ ద్వారా రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

ఏపీలోని 4 రూట్లలో సీప్లేన్ సర్వీసుల ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా సీ ప్లేన్ ధరలు ఉంటాయని చెప్పారు.  సీ ప్లేన్ ఆపరేటింగ్‌కు కేవలం రెండు కిలోమీటర్లు నీరు ఉంటే సరిపోతుందని చెబుతూ ఎయిర్ పోర్టులు లేని ప్రాంతంలో సీ ప్లేన్స్ బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.