శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీశైలం ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, జనార్ధనరెడ్డి, కందుల దుర్గేష్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అలాగే శ్రీశైలం అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలతో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు కూడా శ్రీశైలం అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని, ఆ ప్రకారం శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు.
శ్రీశైలం చుట్టూ అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయన్న చంద్రబాబు శ్రీశైలం స్పిరిచువల్, రిలీజియస్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
తుమ్మలబైలులో టైగర్ సఫారీకి అవకాశం ఉందని, శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యమన్న చంద్రబాబు, శ్రీశైలం నీళ్లు వదిలినపుడు చాలా ఆహ్లాదంగా ఉంటుందని పేర్కొన్నారు. శ్రీశైలం రోప్‌వే మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. శ్రీశైలం సమీపంలో గుహలు, కొండలు ఉన్నాయని, సమీప కొండల వద్ద ట్రెక్కింగ్, ధ్యాన కేంద్రం ఉన్నాయని చెబుతూ శ్రీశైలంలో రోడ్ల వెడల్పుతో పాటు రింగ్‌రోడ్డు నిర్మించామని తెలిపారు.
అంతకుముందు విజయవాడ పున్నమిఘాట్ వద్ద సీ ప్లేన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు అదే సీ ప్లేన్‌లో శ్రీశైలానికి వెళ్లారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు శ్రీశైలం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిపెంటను నివాస యోగ్యంగా తయారు చేయాల్సి ఉందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు.
13వ శతాబ్దం నాటి గండికోట ప్రపంచ ప్రసిద్ధి ప్రాంతమన్న సీఎం, గండికోటలో సాహస కార్యక్రమాలకు మంచి అవకాశాలు ఉన్నాయని, గండికోటను అభివృద్ధి చేస్తే సుందర పర్యాటక ప్రాంతంగా మారుతుందని తెలిపారు. గండికోటలోనూ సీ ప్లేన్ సర్వీసులు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గండికోటలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.
అరకులోయ, లంబసింగి, ప్రకాశం బ్యారేజీ, కోనసీమ, ధవళేశ్వరం బ్యారేజీ ఇలా పర్యాటక ప్రాంతాలను అన్నింటినీ అనుసంధానం చేస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. గోదావరి నీళ్లను రాయలసీమకు తేగలిగితే అది గేమ్ ఛేంజర్‌గా అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్