అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణంకు ఆమోదం

అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణంకు ఆమోదం

రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా 15 వేల కోట్ల రూపాయల మేర రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.

ఈ నిధులతో రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్డిఏను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

 ప్రధాన రహదారులు, డక్ట్ లు, డ్రెయిన్ లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు. అమరావతి రాజధాని సుస్థిర అభివృద్ధికి ఏపీ సీఆర్‌డీఏ సమర్పించిన ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని వెల్లడించారు. 

ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుందని స్పష్టం చేసింది. 

ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 ఏపీ సీఆర్డీఏ కమిషనర్ అధీనంలోనే ఈ అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం, మంగళవారం ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.