ట్రంప్‌ ఎన్నికతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన

ట్రంప్‌ ఎన్నికతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం మారగానే మన దేశంలోని ఆశావహ విద్యార్థుల్లో దడ ప్రారంభమైంది. ఉన్నత చదువుల కోసం క్యూకట్టే అమెరికాలో ట్రంప్‌ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ట్రంప్‌ వస్తే పూర్వంలా అమెరికా వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయా? విదేశీ చదువులపై ఆయన రాక ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలు మన విద్యార్థులను వేధించడం ప్రారంభించాయి.

ట్రంప్‌ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి హెచ్‌1బీ వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు మారనున్నాయి. వర్క్‌ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్‌ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారిపై ఆశలపై నీళ్లు చల్లినట్లే.  ట్రంప్‌ మొదటి నుంచి ఇతర దేశాల నుంచి వలసవచ్చే వారి కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిననాడే అక్రమ వలసలను అడ్డుకుంటామని ప్రకటించారు అయితే ఎడ్యుకేషన్‌ వీసాల పట్ల ట్రంప్‌ సానుకూలంగానే ఉంటారని.. ఇది కొంత అనుకూలమని నిపుణులంటున్నారు.

లే ఆఫ్‌ల భయం.. ఆర్థిక మాంద్యం.. పైగా అనేక ఆంక్షలు, ఉద్యోగాల లేమి పీడిస్తున్నా మన విద్యార్థులు యూఎస్‌పైనే ఆశలు పెట్టుకుంటున్నారు. విదేశీ చదువుల కోసం అత్యధికులు అమెరికానే ఎంచుకుంటున్నారు. అమెరికా వీసాలు పొందుతున్న ప్రతి నలుగురు విదేశీ విద్యార్థుల్లో ఒక్కరు భారతీయ విద్యార్థే ఉండటం విశేషం. 

మన దేశంలోని 69శాతం విద్యార్థులు తమ అంతర్జాతీయ చదువులకు అమెరికానే అత్యుత్తమ గమ్యస్థానంగా భావిస్తున్నారు. 2023లో 1.40 లక్షల వీసాలను ఒక్క మన భారతీయ విద్యార్థులే పొందారు. అమెరికాలో ఉంటున్న వారిలో 18% భారతీయులేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో తెలంగాణ నుంచి 15 వేల మంది ఉంటారని అంచనా. దేశంలోని ముఖ్య నగరాలన్నింటితో పొల్చితే హైదరాబాద్‌ నుంచే అత్యధిక విద్యార్థులు అమెరికా చదువులపై ఉత్సుకత చూపుతున్నారు.

అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు మన దగ్గరితో పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్‌ ప్రభావం కూడా అధికం. దీంతో మనవాళ్లు అమెరికానే తమ మొదటి ఛాయిస్‌గా ఎంచుకుంటారు. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. 

చాలాకాలంగా అక్కడ మొత్తం సీట్లు నిండటం లేదు. మనవాళ్లు చేరితేనే వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్‌ వీసాలకు ఢోకా ఉండదని నిపుణులంటున్నారు. ట్రంప్‌ 2.0లో మూడు ప్రధానమైన అంశాలు ప్రభావితమయ్యే అవకాశముంది. విద్యార్థి వీసాలకు, చదువులకు ఢోకా ఉండకపోవచ్చు. అయితే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్‌ ఫోర్స్‌కు డిమాండ్‌ మరింత పెరగనుంది. 

దీంతో హెచ్‌1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. ఇమ్మిగ్రేషన్‌ దృక్కోణంలో ప్రస్తుతమున్న కోటా పద్ధతిని రద్దుచేసి, పాయింట్‌ బేస్డ్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.