ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి డొనాల్డ్ ట్రంప్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు అమెరికాతో ఉన్న సంబంధాలు, ఒప్పందాలు, సహాయ సహకారాలు ఏ విధంగా మారుతాయోనని ఆలోచిస్తున్నాయి. ఇక కొన్ని దేశాలు అమెరికాకు మరింత దగ్గరిగానూ, మరికొన్ని దేశాలు ట్రంప్‌కు దూరంగానూ జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు మాత్రం డొనాల్డ్ ట్రంప్ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా ఎన్నికల ప్రచారం సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్‌కు అంత మంచిది కాదని అక్కడి హిందువులు భావిస్తున్నారు.
అలాగే ట్రంప్ గెలుపు బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువులకు ప్రయోజనం ఉంటుందని విశ్వసిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్‌కు కొన్ని రోజుల ముందు బంగ్లాదేశీ హిందువులను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, ఆ తర్వాత జరిగిన సంఘటనల్లో అక్కడి హిందువులపై జరుగుతున్న హింస గురించి ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులను ఆకర్షించడానికి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లలతో పాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హిందువుల ఇళ్లు, దుకాణాలను కొంతమంది అల్లరి మూకలు దోపిడీ చేశారని, దీంతో బంగ్లాదేశ్‌లో తీవ్రమైన భయానకమైన, గందరగోళ పరిస్థితులు తలెత్తినట్లు చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని గుర్తు చేశారు.
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా హారిస్‌గానీ, జో బైడెన్‌లుగానీ పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ నుంచి మొదలుకొని.. ఉక్రెయిన్, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు ఎన్నో వివాదాలు ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేసి ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతామని తేల్చి చెప్పారు.
రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని ఆ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. హిందువుల స్వేచ్ఛ కోసం తాను పోరాడతానని, తన పరిపాలనతో భారత్‌తోపాటు తన స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామని ట్రంప్ వెల్లడించారు.
అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తారని మండిపడ్డారు. తాను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కోత విధిస్తానని స్పష్టం చేశారు. అమెరికాను చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తానని.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అమెరికాను అత్యంత శక్తివంతమైన, ఉత్తమమైన దేశంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అమెరికాను మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతానని.. దీపావళి పండగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌త బంగ్లా తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవి నుంచి తనను దించేందుకు అమెరికా కూడా కారణం అని షేక్ హసీనా చేసిన ప్రకటన కూడా సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ నుంచి సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికా కోరుకుందని, దానికి అడ్డుపడినందుకే తన పదవిని పోగొట్టడంలో అమెరికా హస్తం ఉందని ఆమె ఆరోపించారు.
కొన్ని రోజుల క్రితం అమెరికాలో పర్యటించిన మహమ్మద్ యూనస్ డొనాల్డ్ ట్రంప్ సహా ఏ రిపబ్లికన్ పార్టీ నాయకుడిని కలవలేదు. ఆ పర్యటనలో బైడెన్, యూనస్ భేటీ అయి లోతైన చర్చలు జరిపారు. బంగ్లాదేశ్‌కు పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా వెల్లడించింది. అయితే 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో బంగ్లాదేశ్ ప్రతినిధుల బృందాన్ని కలిశారు.
అయితే ఆ సమయంలో మహ్మద్ యూనస్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢాకా నుంచి వచ్చిన మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ ఉన్నాడని ఈ ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు విరాళం ఇచ్చాడని తాను విన్నానని ట్రంప్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని మైక్రో ఫైనాన్స్ స్పెషలిస్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్యాంక్ అయిన గ్రామీణ్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఉన్న మహ్మద్ యూనస్ గురించి ఆ సందర్భంగా ట్రంప్ పరోక్షంగా ప్రస్తావించారు. ఇవన్నీ చూస్తుంటే తన హయాంలో బంగ్లాదేశ్, అమెరికా మధ్య సంబంధాలు జో బైడెన్ ఉన్నప్పుడు ఉన్నంత ఉన్నంత మెరుగ్గా ఉండవని ట్రంప్ చర్యల ద్వారా అర్థం అవుతోంది.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు