అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(ప్రతినిధుల సభ) భారత సంతతి పౌరులు ఘన విజయం దక్కించుకున్నారు. అంచనాలకు అనుగుణంగానే ఓట్ల వేటలో దూసుకుపోయారు. ఈ సారి ఎన్నికల్లో 9 మంది పోటీ చేయగా.. ఆది నుంచి కూడా ఆరుగురు గెలుపుగుర్రం ఎక్కడం ఖాయమని సర్వేలు చాటిచెప్పాయి. ఈ సర్వేల అంచనాలకు అనుగుణంగానే ఆరుగురు భారత సంతతి అభ్యర్థులు విజయం అందుకున్నారు.
మరో అభ్యర్థి అమిష్ షా అరిజోనాలో లీడింగ్‌లో ఉండడం గమనార్హం. ఈయన కూడా విజయం సాధిస్తే ఏడుగురు అభ్యర్థులు ప్రతినిధుల సభలో అడుగు పెట్టినట్టు అవుతుంది. ఇక, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాన్ని చూస్తే ఆరుగురు అభ్యర్థులు గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఇప్పటి వరకు ప్రతినిధుల సభలో ఐదుకే పరిమితమైన భారత సంతతి నేతల సంఖ్య ఆరుకు పెరిగింది.
సుహాస్ సుబ్రమణ్యం: వర్జీనియా స్టేట్ సెనేటర్‌గా ఉన్న ఈయన తొలిసారి 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేశారు. అరంగేట్రంలోనే అద్భుతమైన విజయాన్ని అందుకుని వర్జీనియా నుంచి గెలిచిన తొలి భారత సంతతి నేతగా చరిత్ర సృష్టించారు. సుహాస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేయగా, రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన మైక్ క్లాన్సీ పరాజయం పాలయ్యారు.
‘‘వర్జీనియా ప్రజల తీర్పును అత్యంత గౌరవంగా స్వీకరిస్తున్నా. వారికి సేవ చేసేందుకు అహరహం శ్రమిస్తా’’ అని సుహాస్ పేర్కొన్నారు. వర్జీనియాను తన సొంత ఇల్లుగా ఆయన తెలిపారు. ‘‘నా వివాహం ఇక్కడే జరిగింది. ఇక్కడి సమస్యలను నా సొంత కుటుంబ సమస్యలుగా భావించి పరిష్కరిస్తా’’ అని పేర్కొన్నారు. సుహాస్ గతంలో బరాక్ ఒబామా ప్రభుత్వం వైట్ హౌస్ సలహాదారుగా వ్యవహరించారు.
అమిష్ షా: అరిజోనాలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ నేత, రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్‌స్క్యూకెట్‌కు, షాకు మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. కడపటి వార్తలు అందే సరికి 63 శాతం ఓట్లను లెక్కించగా షాకు 1,32,712 ఓట్లు రాగా, డేవిడ్‌కు 1,28,606 ఓట్లు వచ్చాయి.
డాక్టర్ అమిబెరా: వైద్య వృత్తిలో ఉన్న అమిబెరా భారత సంతతి నేతల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు. కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు.
శ్రీథానేదార్: మిచిగాన్(13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా రెండో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2023లో తొలి విజయం అందుకున్నారు.
ప్రమీలా జయపాల్: వాషింగ్టన్(7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు.
రో ఖన్నా: కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ) నుంచి 2013 నుంచి వరుసగా విజ యం దక్కించుకుంటున్నారు.
రాజా కృష్ణమూర్తి: ఇల్లినోయి్‌స(7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా 5వ సారి విజయం దక్కించుకున్నారు. ఇక్కడ పోటీ చాలా కఠినంగా సాగడం గమనార్హం. ప్రజలు తనపట్ల చూపిన విశ్వాసానికి ఎంతో ముగ్ధుడిని అయ్యానని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని తెలిపారు. ప్రజల కలలను సాకారం చేసేందుకు నిరంతరం కష్టిస్తానన్నారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్