అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హవా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హవా
 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రంప్‌ 20 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఆయనకు 198 ఎలక్టోరల్‌ సీట్లు లభించాయి. మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకౌటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మెస్సోరీ, మిస్సీసిప్పి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాలను ట్రంప్‌ కైవసం చేసుకున్నారు.

డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారీస్‌ ఇల్లినాయిస్‌, న్యూజెర్సీ, మేరీలాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మాసాచుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌, కొలరాడో, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా రాష్ట్రాలతో 112 ఎలక్టోరల్‌ సీట్లు కైవసం చేసుకున్నారు.

ట్రంప్‌ అధ్యక్షుడు కావాలంటే ‘బ్లూ వాల్‌’ను బ్రేక్‌ చేయాల్సిందే అని అంటున్నారు అమెరికా పొలిటికల్‌ పండిట్లు. సంప్రదాయంగా డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతిచ్చే రాష్ర్టాలను ‘బ్లూవాల్‌’ స్టేట్స్‌ అంటారు. ఇవి 18 రాష్ర్టాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, మిషిగన్‌, న్యూజెర్సీ, వాషింగ్టన్‌, మసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌, మిన్నెసోటా, విస్కాన్సిన్‌, ఓరెగావ్‌, కనెక్టికట్‌, హవాయ్‌, మైనె, రోడ్‌ ఐలాండ్‌, డెలావర్‌, వెర్మాంట్‌ రాష్ర్టాలను బ్లూ వాల్‌ స్టేట్స్‌ అంటారు. 

వీటిల్లో 238 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 270 ఎలక్టోరల్‌ ఓట్లు కావాలి. కాబట్టి, ఈ బ్లూవాల్‌ స్టేట్లను కనుక కమలా హారిస్‌ నిలుపుకోగలిగితే అధ్యక్షురాలు కావడం సులభం. ట్రంప్‌ గెలవాలంటే ఈ 18 రాష్ర్టాల్లో కొన్నింటినైనా తన వైపు తిప్పుకోవాలి.

భారత్‌లా అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్‌ లాంటిది లేదు. ఆయా రాష్ర్టాలే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాయి. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తి చేసి ప్రకటించేందుకు డిసెంబరు 11 వరకు సమయం ఉంటుంది. అధికారికంగా ఫలితాలు వెలువడేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా మీడియా సంస్థలు నాలుగైదు రోజుల్లో ఫలితాలను అంచనా వేయవచ్చు.