విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రజాభిప్రాయ సేకరణ కంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం నేరమా? కాదా ? అనే విషయం ప్రజాకోర్టులో తేలి శిక్షించడమే సరైన నిర్ణయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాస్వామ్యం చిన్నబోయే విధంగా గత వైసీపీ పాలకులు రుషికొండ ప్యాలెస్ నిర్మించారని దుయ్యబట్టారు.
విశాఖలోని రుషికొండ భవనాలను శనివారం పరిశీలించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 500 కోట్లతో నిర్మించిన భవనాలను రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్‌రావు, పల్లా శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. దాదాపు గంటకు పైగా భవనాలను అనువణువునా పరిశీలించారు. మంచినీళ్ల మాదిరిగా డబ్బులు ఖర్చు పెట్టిన ఆర్థిక నేరస్థుడు జగన్ ఆంధ్రా ఎస్కోబార్ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు.
పేదల పేరు చెప్పి విలాసవంతమైన ప్యాలెసులు కట్టుకున్నాడని విమర్శించారు. ప్యాలెస్‌ను తిలకించేందుకు ప్రజలకు అనుమతి ఇస్తామని , అనంతరం అందరి అభిప్రాయాలు తీసుకుని, జగన్ ఉల్లంఘలను వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ ముసుగులో తప్పులు చేసి ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.ఈ భవనాల విషయంలో ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ మభ్య పెట్టారని ధ్వజమెత్తారు.
గతంలో నేను, నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఇక్కడకు రావాలని ప్రయత్నించామని కానీ ఎవరినీ రానీయకుండా చేశారని మండిపడ్డారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నది ఆశ్చర్యం కలుగుతుందని, ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం,తన స్వార్థం కోసం ప్యాలెస్‌లు నిర్మించుకోవడం గుండె చెదిరిపోయే విషయాలని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రుషికొండ ప్యాలెస్ వాస్తవాలు బయట పెట్టడానికి మీడియా, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, నేను, పవన్‌కల్యాణ్, బీజేపీ నాయకులు ప్రయత్నించిన సాధ్యం కాలేదని వివరించారు.సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టారని విమర్శించారు. ప్రజాధనంతో రాజులు కూడా ప్యాలెస్ కట్టుకోలేదని పేర్కొంటూ రుషికొండ ప్యాలెస్‌లు రాష్ట్రపతి, ప్రధాని విడిది కోసమని, పర్యాటక ప్రాంతమని బుకాయించి వారి పేరును బదనాం చేశారని ఆరోపించారు. గజపతి బ్లాక్‌లో కాన్ఫరెన్స్ గదులు నిర్మించారని చెబుతూ ఇటువంటివి వైట్‌హౌజ్‌లో గాని , భారత రాష్ట్రపతి నివాసంలో కూడా లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్