కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకుని తిరిగివ్వకపోవడంతోపాటు శారీరకంగా వాడుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జునపై విజయవాడకు చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మేరుగు నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదు చేశారు.
మాజీ మంత్రికి సహకరించి, బాధితురాలిని బెదిరించిన ఆయన పీఏపై బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ “ఐదు సంవత్సరాలుగా నాకు మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పరిచయం ఉంది. ఆయన తన శాఖకు సంబంధించిన కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నారు. సార్ మీతో మాట్లాడతానన్నారు అని చెప్పి ఆయన పీఏ మురళీమోహన్‌రెడ్డి తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని మంత్రి ఉండే అపార్టుమెంట్‌కు తీసుకెళ్లేవాడు” అని తెలిపారు.
“గదిలోకి వెళ్లిన వెంటనే బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడు. ఎలాంటి కాంట్రాక్ట్ పనులు ఇప్పించకపోగా ఈ నేపథ్యంలో మేరుగు నాగార్జున నన్ను బలవంతంగా నాలుగుసార్లు శారీరకంగా అనుభవించారు. నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రాధేయడినా పట్టించుకోలేదు. గట్టిగా అడిగితే విశాఖకు చెందిన ఓ గిరిజన టీచర్‌ను స్లోపాయిజన్ ఇచ్చి హతమార్చామన్నారు. నీకు కూడా ఆ గతే పడుతుందని ఆయన పీఏ బెదిరించారు” అని ఆమె ఆరోపించారు.
అప్పులు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పుడు పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, ఆయన పీఏపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కల్యాణ్‌రాజు పేర్కొన్నారు. అయితే, తనపై ఆరోపణలు చేసిన మహిళతో ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఎటువంటి పరీక్షలకైనా, ఉరిశిక్షకైనా సిద్ధమేనని ఆయన తెలిపారు.
మహిళ వద్ద రూ.90 లక్షలు తీసుకున్నానని, ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాననడం అవాస్తవమని చెప్పారు. తనపై ఆరోపణలు, ఫిర్యాదులు అంతా కుట్ర ప్రకారం జరిగాయని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై తానే జిల్లా ఎస్పీని కలిసి పూర్తిస్థాయి విచారణ కోరతానని తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తానని, కుట్రదారుల్నీ వదిలిపెట్టనని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్