కెనడాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో పని చేస్తున్న భారత సంతతి యువతి గుర్‌సిమ్రాన్ కౌర్ (19) మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాల్‌మార్ట్ స్టోర్ బేకరీ సెక్షన్‌లో గుర్‌సిమ్రాన్ కౌర్ ఈ నెల 19న అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనిపై వాల్‌మార్ట్ మరో ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుర్ సిమ్రాన్ కౌర్ ను పై నుంచి కింద తోసేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
హాలిఫాక్స్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో గుర్‌సిమ్రాన్ కౌర్ రెండేండ్లుగా పని చేస్తున్నది. ఈ అనుమానాస్పద కేసు దర్యాప్తు కొనసాగుతుందని స్థానిక పోలీసులు గతవారం చెప్పారు. ఆ యువతి హత్యకు కారణం గానీ, హత్య జరిగిన తీరుపై ఇంకా నిర్ధారణకు రాలేదని పోలీస్ వర్గాల కథనం. ‘పలు దర్యాప్తు సంస్థలతో కలిసి విచారిస్తున్నాం. దర్యాప్తు సంక్లిష్టంగా ఉంది. దర్యాప్తు పూర్తి కావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది’ అని హాలిఫాక్స్ రీజనల్ పోలీసు కార్యాలయం తెలిపింది. అయితే వాల్‌మార్ట్ ఉద్యోగులు సదరు మృతురాలిని ఓవెన్‌లో పెట్టి చంపేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశారు.
గత శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో హాలిఫాక్స్ రీజనల్ పోలీసులను సంఘటనా స్థలానికి పిలిపించి చూడగా ఆమె మృతదేహం వాక్ ఇన్ ఓవెన్ లో కనిపించింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆ వాల్ మార్ట్ దుకాణాన్ని మూసివేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తు సంక్లిష్టమైనదని పోలీసు కానిస్టేబుల్ మార్టిన్ క్రోమ్వెల్ అభివర్ణించారు. దర్యాప్తును త్వరగా ముగించడానికి ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నారని చెప్పారు.
19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్ కుటుంబం భారత్ లోని పంజాబ్ నుంచి ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లారు. గుర్ సిమ్రాన్ కౌర్ మృతదేహం ఆమె తల్లికి ఓవెన్ లోపల కనిపించింది. ఆ యువతి సాధారణంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయదని, కానీ, ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ గా ఉందని ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. దాంతో, ఆమె తన కుమార్తె ఆచూకీ కోసం పదేపదే ప్రయత్నించింది.
అయితే, ఆ వాల్ మార్ట్ స్టోర్ లోని ఇతర ఉద్యోగులు ఆమె ఆందోళనలను తోసిపుచ్చారు. కౌర్ ఇతర కస్టమర్లకు సహాయం చేయడంలో బిజీగా ఉండవచ్చని సూచించారు. అయితే, ఆ ఓవెన్ నుంచి లీకేజీ కనిపించడంతో చివరకు ఆ ఓవెన్ ను తెరిచి చూశారు. 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్ ను మరో వ్యక్తి ఆ భారీ ఒవేన్ లోపల ఉంచినట్లు అనుమానిస్తున్నారు. ఆ ఓవెన్ ఆన్ లో ఉందని, డోర్ హ్యాండిల్ ఉందని, లోపలి నుంచి దాన్ని మూయడం, తెరవడం అసాధ్యమని వాల్ మార్ట్ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు.
లోపలినుంచి ఓవెన్ ను ఆన్ చేయడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు. కౌర్ ను ఎవరైనా హత్యా చేసి కానీ, లేదా అపస్మారక స్థితిలో ఉండగా కానీ, ఆ భారీ ఓవెన్ లో పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ భారీ వాక్-ఇన్ ఓవెన్లను క్యాబినెట్ లేదా బ్యాచ్ ఓవెన్లు అని కూడా పిలుస్తారు. సూపర్ మార్కెట్ల వంటి ప్రదేశాలలో, పెద్ద పెద్ద బేకరీలలో ఇవి తరచుగా కనిపిస్తాయి.
కాగా, ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన కెనడాలోని సిక్కు కమ్యూనిటీని షాక్ కు గురి చేసింది. బాధిత కుటుంబానికి ఆర్థికంగా మద్ధతు ఇవ్వడానికి అక్కడి సిక్కు సమాజం డిజిటల్ ఫండ్ రైజర్ ను ప్రారంభించారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్