భారీగా పెరిగిన బంగారం దిగుమతులు

భారీగా పెరిగిన బంగారం దిగుమతులు
 
భారత్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై- సెప్టెంబర్‌) మధ్య దేశంలో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయి 248.3 టన్నులకు చేరుకుంది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో బంగారం డిమాండ్ 210.2 టన్నులుగా నమోదైంది.
అదే సమయంలో బంగారం విలువ పరంగా డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 53 శాతం పెరిగి రూ.1,65,380 కోట్లకు చేరుకున్నది. 2023 మూడో త్రైమాసికంలో రూ. 1,07,700 కోట్ల విలువైన బంగారాన్ని విక్రయించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్  విడుదల చేసిన నివేదిక ప్రకారం జూలై- సెప్టెంబర్‌ మధ్య బంగారు ఆభరణాల డిమాండ్‌ మొత్తం 10శాతం పెరిగి 171.6 టన్నులకు చేరుకుంది.

విలువ పరంగా రూ.1,14,300 కోట్ల విలువైన ఆభరణాలను కొనుగోలు చేశారు. 2023లో జూలై- సెప్టెంబర్ రూ.79,830 కోట్ల కంటే 43 శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. 2015 తర్వాత బంగారానికి ఇది బలమైన మూడో త్రైమాసికమని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ సీఈవో సచిన్‌ జైన్‌ పేర్కొన్నారు.

బలమైన దేశీయ డిమాండ్‌ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్- సెప్టెంబర్) దేశ బంగారం దిగుమతులు 21.78 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2023-24 ప్రథమార్థంలో మొత్తం 22.25 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 2.3 బిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి.

ఇది ఏడాది కిందట ఇదే కాలంలో వచ్చిన 480.6 మిలియన్ల కంటే 376.41 శాతం ఎక్కువ. 2023-24లో మొత్తం బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దాదాపు 40 శాతం వాటాతో స్విట్జర్లాండ్ భారత్‌కు అత్యధికంగా బంగారం ఎగుమతి దేశంగా నిలిచింది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 16శాతంతో రెండు, దక్షిణాఫ్రికా 10శాతంతో మూడోస్థానంలో ఉన్నాయి. బంగారం దిగుమతుల పెరుగుదలతో దేశ వాణిజ్య లోటు ప్రథమార్థంలో 119.24 బిలియన్‌ డాలర్ల నుంచి 134.77 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఏప్రిల్‌-జూన్‌ 2024 కరెంట్‌ ఖాతాలో లోటు కూడా స్వల్పంగా 1.1శాతం పెరిగింది.