అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ప్రకటించిన టిడిపి కూటమి రూ. 6,072 కోట్ల భారాన్ని మోపింది. 2022-23 సంవత్సరానికి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్‌పిపిసిఏ) వసూళ్లకు (ట్రూఅప్ ఛార్జీలు) ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎపిఇఆర్‌సి) అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో డిస్కమ్‌ల ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటికే అధిక ధరలతో సతమతమౌతున్న సామాన్య ప్రజానీకానికి ఇది పెనుభారం కాగా, డిస్కమ్‌లు రూ.8,114 కోట్లు ప్రతిపాదిస్తే అందులో రూ.2,042 కోట్లు తగ్గించి ఉపశమనం కల్గించినట్లు ఎపిఇఆర్‌సి పేర్కొనడం గమనార్హం. ఎస్‌పిడిసిఎల్ పరిధిలో సరాసరిగా నెలకు యూనిట్‌కు అత్యధికంగా రూ.0.83 పైసలు, సిడిపిడిసిఎల్ పరిధిలో రూ.0.79పైసలు, ఈడిడిసిఎల్ పరిధిలో రూ.0.80 పైసలు అదనంగా వసూలుకు అవకాశం కల్పించింది. 15 నెలసరి వాయిదాల్లో వసూలు చేయాలని స్పష్టంచేసింది.
2022-23 సంవత్సరానికి సంబంధించి వినియోగించిన విద్యుత్‌పై ఈ ఏడాది నవంబరు నుండి విధించే ఎఫ్‌పిపిసిఏలో నెల వారీగా యూనిట్‌కు ఎంత వసూలు చేయాలనేది కూడా సూచించింది. ఈ మొత్తాన్ని డిసెంబర్ నెల నుండి వినియోగదారుల నుండి వసూలు చేయనున్నారు. 2022 ఏప్రిల్‌లో వినియోగించిన విద్యుత్‌కు ట్రూ అప్ ఛార్జీలను ఈ ఏడాది నవంబరు, డిసెంబరులో వసూలు చేయనున్నారు.
2022 మే నెల ఖర్చును 2025 జనవరి, ఫిబ్రవరి నెలలో వసూలు చేస్తారు. 2022 జూన్ వినియోగాన్ని 2025 మార్చి, ఏప్రిల్‌లోనూ, జులై నెల వినియోగాన్ని 2025 ఫిబ్రవరి, 2022 ఆగస్టు వినియోగాన్ని 2025 మార్చిలో వసూలు చేయనున్నారు. సెప్టెంబరు వినియోగాన్ని ఏప్రిల్‌లోనూ, అక్టోబరు వినియోగాన్ని మేనెలలోనూ, నవంబరు వినియోగాన్ని జూన్‌లోనూ, డిసెంబరు వినియోగాన్ని జులైలోనూ వసూలు చేస్తారు.
2023 జనవరిలో వినియోగించిన మొత్తాన్ని 2025 ఆగస్టు, సెప్టెంబరులోనూ, ఫిబ్రవరి వినియోగాన్ని 2025 అక్టోబరు, నవంబరులోనూ, మార్చి వినియోగాన్ని 2025 డిసెంబరు, 2026 జనవరిలోనూ వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు